Breaking News

మేఘన ట్రావెల్స్‌ బస్సులో మంటలు.. ప్రయాణికులు హాహాకారాలు


హైదరాబాద్‌ నగరంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేగింది. ప్రయాణికులంతా హాహాకారాలు చేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి అందరినీ దించివేశాడు. మేఘనా ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు(ఏఆర్‌ 01టి 0306) సోమవారం రాత్రి మియాపూర్ నుంచి తిరుపతికి బయలుదేరింది. మూసాపేట దగ్గరికి వచ్చేసరికి బస్సులో నుంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించి డ్రైవర్‌కు చెప్పారు. దీంతో అతడు మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద బస్సును ఆపేసి అందరినీ దించేశాడు. ఆ వెంటనే మంటలు వ్యాపించి బస్సు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ హుస్సేన్‌తో పాటు 8మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైరింజన్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఏసీలో సాంకేతిక లోపం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సకాలంలో బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని, ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.


By August 13, 2019 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/meghana-travels-bus-catches-fire-due-to-short-circuit-in-hyderabad/articleshow/70652698.cms

No comments