వీడియో తీసిందని.. యువతిని తాకరాని చోట తాకుతూ.. బెంగళూరులో పట్టపగలే..
ఐటీ నగరం బెంగళూరులో పట్టపగలు నడిరోడ్డు మీద 22 ఏళ్ల ఓ విద్యార్థిని ఏడుగురు ఆకతాయిలు చుట్టుముట్టారు. ఆమె ఒంటి మీద దుప్పట్టా లాగుతూ, తాక రాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీనంతటికీ కారణం.. నడి రోడ్డు మీద వారు అక్రమంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆమె వీడియో తీయడమే. ఈ ఘటన బెంగళూరులోని నందినీ లే అవుట్‌లో ఉన్న సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అంబేద్కర్ పార్క్ సమీపంలో నడిరోడ్డు మీద కొందరు యువకులు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుండటాన్ని తబసుమ్ బిబీ (పేరు మార్చాం) చూశారు. విగ్రహం మొత్తాన్ని పూలతో అందంగా అలంకరించారు. దీంతో ఈ తతంగాన్ని ఆమె వీడియో తీయడం ప్రారంభించారు. బిబీ వీడియో తీసి అక్రమంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేస్తుందని గ్రహించిన స్థానిక యువకులు ఆమెను చుట్టుముట్టారు. ఆమె దుప్పట్టా లాగుతూ, చేతిని పట్టుకొని వీడియో డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె.. ఫోన్ లాక్ చేసి తన స్కూటర్ దగ్గరకు పరిగెత్తింది. లాక్ తీసి స్కూటర్ స్టార్ట్ చేసేలోపే మళ్లీ వారంతా ఆమెను చుట్టుముట్టారు. స్కూటర్ కీ లాగేసుకున్నారు. తాకరాని చోట తాకుతూ వీడియోలు డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఫోన్ కూడా లాగేసుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. ఏడుగురు యువకులతో బిబీ పెనుగులాడుతుంటాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రావడాన్ని గమనించిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. పనిలో పనిగా ఫోన్, స్కూటర్ తాళం కూడా తీసుకెళ్లారు. ఏడుగురిలో ఆరుగురు ఆకతాయిలను పోలీసులు పట్టుకున్నారు. రవి అనే యువకుడు పరారీలో ఉన్నాడు. బాధితురాలి సమక్షంలో ఫోన్ అన్‌లాక్ చేసి చూడగా.. ఆమె తీసిన ఫొటోలు, వీడియోలన్నీ డిలీట్ చేసినట్టు అర్థమైంది. వీరందరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
By August 07, 2019 at 12:37PM
No comments