Breaking News

అయోధ్య కేసు.. నవంబరులో సుప్రీంకోర్టు తీర్పు!


ఏడు దశాబ్దాలుగా సాగుతోన్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదం ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ కేసులో తుది తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నవంబరులో వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ ఆగస్టు 6 ఐదుగురు న్యాయమూర్తల రాజ్యాంగ ధర్మాసనం ప్రారంభించింది. ప్రతి ఒక్కరి వాదనలనూ వినిపించే అవకాశం కల్పించిన ధర్మాసనం.. వాటిని పునరావృతం చేయడం లేదా పునరుద్ఘాటించడానికి మాత్రం అనుమతించడం లేదు. ఇప్పటికే నిర్మోహీ అఖారా, ఆల్ ఇండియా రామ్ జన్మస్థాన్ పునరుతాన్ సమితి, హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డ్, 1951లో తొలిసారిగా అయోధ్యపై కేసు దాఖలుచేసిన గోపాల్ సింగ్ విశారద్‌ తదితరులు తమ వాదనలు వినిపించారు. కాగా, వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు భాగాలుగా చేస్తూ సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లాకు అప్పగిస్తూ 2010లో 2:1 మెజార్టీతో ముగ్గురు సభ్యుల అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును మూడు వర్గాలు సవాల్ చేశాయి. రామ్‌లల్లా, నిర్మోహీ అఖడా వరుసగా 16 రోజూ విచారణకు హాజరుకాగా, సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ రాజీవ్ ధావన్ మాత్రం వారంలో ఐదు రోజులు మాత్రమే విచారిస్తామన్న సుప్రీం నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ హాజరుకాలేదు. కాగా, తాను పదవీ విరమణ చేసేలోగా ఈ వివాదంపై తుది తీర్పును జస్టిస్ రంజన్ గొగొయ్ వెల్లడించే అవకాశం ఉందని న్యాయస్థానం వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది నవంబరు 17న జస్టిస్ గొగొయ్ పదవీవిరమణ చేయనున్నారు. వివాదాస్పద భూమిలో మూడింట రెండు పార్టీల వాదనలు పూర్తి చేయడంతో నవంబర్‌లో తుది తీర్పు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటున్నారు. అయితే, వాదనలు వినిపించడానికి తాను 20 రోజులు సమయం కావాలని ధర్మాసనాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫు లాయర్ రాజీవ్ ధావన్ కోరారు. ధావన్ కొరిన విధంగా తన వాదనలు వినిపించినా తీర్పు వెలువరించడానికి నెల రోజుల సమయం ఉంటుంది. వివాదాస్పద ప్రాంతంలో మసీదును 6 డిసెంబర్ 1992లో కర సేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. మరోవైపు అయోధ్యపై సుప్రీం కోర్టు ఏర్పాటుచేసి మధ్యవర్తిత్వ కమిటీ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. పాత తీర్పులను పక్కన పెట్టి మధ్యవర్తిత్వానికి కృషి చేయాలని పేర్కొన్న సుప్రీం.. చర్చల ద్వారా పరిష్కారమవుతుందని భావించింది. ఇందుకు నియమించిన కమిటీకి గడువును మే 7గా తొలుత స్పష్టం చేసిన ధర్మాసనం.. దానిని ఆగస్టు వరకూ పొడిగించింది. ఆగస్టు 1న ఆ కమిటీ నివేదిక సమర్పించడంతో సుప్రీం కోర్టు మళ్లీ కేసు విచారణ ప్రారంభించింది. మసీదులో నమాజ్ చేయడం అనేది ఇస్లాం మతంలో అంతర్భాగం కాదంటూ 1994లో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సమీక్ష కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదలాయించాలంటూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. 1994 ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పులో ప్రార్థనలు ఎక్కడైనా చేసుకోవచ్చు, నమాజ్ మసీదులోనే చేయాలనేమీ లేదు అని సుప్రీం కోర్టు చెప్పింది.


By August 31, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-likely-to-verdict-in-ayodhya-case-in-november/articleshow/70920879.cms

No comments