Breaking News

జగన్ 60రోజుల్లో 60 తప్పులు చేశారు: డొక్కా


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేస్తూ ప్రజలకు ముద్దులు పెట్టిన వైఎస్ జగన్.. అధికారంలోకి రాగానే జనాలకు వాతలు పెడుతున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న జగన్ ఎలా పరిపాలిస్తాడో చూద్దామని ఓట్లేసిన ప్రజలకు జగన్ బాగానే బుద్ధి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో జగన్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. జగన్ అసమర్థ పాలన, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుకు నిరసనగా టీడీపీ గుంటూరులోని లాడ్జి సెంటర్‌లో బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. 45 సంవత్సరాలకే పింఛన్లు తూచ్‌..తూచ్‌.., నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్ల రద్దు.. ఇవీ వైకాపా పాలనలో సాధించిన విజయాలు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపా నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ 60రోజుల పాలనలో 60 తప్పులు చేశారని ఆరోపించారు. జగన్‌కు అవకాశమిస్తే రాష్ట్రం 50సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయేలా చేస్తున్నారని, ఆయన పాలనలో ఇసుక బస్తా రేటు.. సిమెంట్ బస్తాను మించిపోయిందని అన్నారు. ఇదేనా జగన్ చేస్తున్న సుపరిపాలన అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రాష్ట్రానికి క్యూ కడితే.. జగన్ అధికారంలోకి వచ్చాక వారు వెనక్కి పరుగులు పెడుతున్నారని డొక్కా ఎద్దేవా చేశారు. శాసనసభలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, అసెంబ్లీని వైసీపీ ఆఫీసుగా మార్చేశారని ఆరోపించారు.


By August 01, 2019 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/dokka-manikya-vara-prasad-allegations-on-cm-ys-jagan/articleshow/70474974.cms

No comments