Breaking News

ఆగస్టు 6న ఢిల్లీకి జగన్, మోదీతో భేటీ.. కారణమిదేనా?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆగస్టులో విదేశీ, ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా గడపనున్నారు. తొలుత తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం జెరూసలెం వెళ్తోన్న విషయం తెలిసిందే. అక్కడ నుంచి వచ్చిన తర్వాత రెండు రోజులు ఢిల్లీలో గడుపుతారు. అది పూర్తయిన తర్వాత అమెరికాలోనూ జగన్ పర్యటిస్తారు. ఇక, ఆగస్టు 6,7 తేదీల్లో ఢిల్లీలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పర్యటిస్తారు. ప్రధానిగా మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన రోజే సైతం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ ప్రమాణస్వీకారానికి ఏపీ సీఎం హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రధానిని జగన్‌ కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయం సకాలంలో, పూర్తిస్థాయిలో అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు జగన్ అపాయింట్‌మెంట్ కోరారు. సీఎం తన ఢిల్లీ పర్యటనలో పలు అంశాలకు సంబంధించి కేంద్ర హోం, ఆర్థిక, విద్యుత్‌ శాఖ మంత్రులతో భేటీ కానున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత, ఆగస్టు 8న పులివెందులలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు, అమెరికా పర్యటనకు వెళ్లనున్న జగన్‌ బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌‌కు చేరుకుని యూఎస్‌ కాన్సులేట్‌‌లో వీసా తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం జెరూసలెం వెళ్తున్న జగన్, తిరిగి ఆగస్టు 5న అమరావతికి చేరుకుంటారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు జగన్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిచిగన్- డెట్రాయిట్ -కోబో కన్వెన్షన్ సెంటర్‌లో ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి సమావేశంకానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ పొందారు. విజయవాడలో ఉన్న పాస్‌పోర్ట్‌ కార్యాలయానికి వెళ్లిన జగన్.. ఈ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. ఆ తర్వాతే అమెరికా పర్యటన ఖాయమయ్యింది.


By August 01, 2019 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cm-ys-jagan-mohan-reddy-to-visit-delhi-on-august-6th/articleshow/70475302.cms

No comments