ఆర్టికల్ 370 కాంగ్రెస్ ఆరోపణలు.. ఏపీ విభజనను గుర్తుచేసిన అమిత్ షా!
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న బిల్లులను పార్లమెంటులో కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్రపతి సైతం ఆమోదం తెలిపారు. రాజ్యసభలో ఈ బిల్లుపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయగానే, విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభలో గందరగోళం నెలకోవడంతో ప్రత్యక్ష ప్రసారాలను కాసేపు నిలిపివేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. మాకు నీతులు చెప్పే నేతలు ఆంధ్రప్రదేశ్ ఏపీ విభజన సమయంలో ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. జమ్మూ-కశ్మీర్ లాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు కాబట్టి మిగతా రాష్ట్రాల విషయంలో ఇదే పంథా కొనసాగించబోమని కేంద్ర హోం మంత్రి ఉద్ఘాటించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటుచేసినప్పుడు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం తలెత్తలేదని, ఏపీ విభజించిన కాంగ్రెస్ నాడు ఎలా వ్యవహరించిందో ఒకసారి కళ్లుమూసుకుని గుర్తు చేసుకోండని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలు మార్షల్స్‌తో అందరినీ బయటకు గెంటేసి, తలుపులు బిగించి, టీవీలు ఆపేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన పూర్తిచేశారని దుయ్యబట్టారు. అయితే, కశ్మీర్ విషయంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, ఎలా చేయాలో మాకు పాఠాలు చెప్పొద్దని హోంమంత్రి చురకలంటించారు. అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ ఖండించారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై తమ ప్రభుత్వం ఏడాదిపాటు నిరంతరం సంప్రదింపులు జరిపిందని, ఆనాడు తానే అన్నివర్గాల అభిప్రాయాలను తీసుకున్నానని తెలిపారు. అంతేకాదు, ఏపీ విభజన ముసాయిదా బిల్లును ముందే నేతలందరికీ చూపించినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఆయోధ్య రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అంశాలను బీజేపీ ప్రధానంగా తలకెత్తుకుంది. ఆర్టికల్ 370 రద్దు అంశంపై కీలక ముందుడుగు వేసింది. ఇక ఇక మిగిలిన రెండు ప్రధానాంశాలపై ముందుకు వెళ్తుందనే ఆశల్ని ఆర్టికల్ 370 రద్దు రేకెత్తిస్తోంది. దీని తరహాలోనే ఉమ్మడి పౌర స్మృతి, అయోధ్య రామ మందిరం సత్వర నిర్మాణం దిశగా పావులు కేంద్రం కదుపుతుందని బీజేపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. హిందుత్వ ప్రాతిపదికన ఓటర్ల ఏకీకరణకు ఈ చర్యల్ని చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముస్లింలకు మరింత చేరువయ్యే ప్రయత్నాలను కాంగ్రెస్ ఒకపక్క చేస్తున్నా... హిందుత్వ విషయంలో సానుకూలంగా వెళ్లడానికి 2014 నుంచి మొదలైన చర్యలకు ఇది విఘాతం కలిగే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది.
By August 06, 2019 at 09:45AM
No comments