Breaking News

ఎన్ఆర్సీసీ తుది జాబితా వెల్లడి.. అసోంలో భారతీయులు 3.11 కోట్ల మందే!


జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) తుది జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొన్నారు. మొత్తం 19 లక్షల మందిని అనర్హులుగా తేల్చారు. కాగా, ఈ జాబితా కోసం 3.3 కోట్ల మంది అస్సామీలు ఆత్రుతతో ఎదురుచూశారు. తొలిసారిగా 1951లో వెల్లడించిన ఎన్ఆర్సీకి గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మార్పులు చేర్పులు చేపట్టారు. అసోంలోని అక్రమవలసదారులెవరో? అసలు భారతీయులెవరో తేల్చేడమే ఎన్ఆర్సీ ముఖ్యోద్దేశం. కాగా, శనివారం నాడు అనుబంధ జాబితా వెల్లడించిగా.. గతంలో ఎన్ఆర్సీ ముసాయిదాలో పేర్లు గల్లంతైనవారి నుంచి అభ్యంతరాలను స్వీకరించి, వారిని ఇందులో చేర్చారు. అంతేకాదు, ముసాయిదాలో పేరు లేనివారు తగిన ఆధారాలతో విచారణకు హాజరుకావాలని జూలై 5న ఆదేశించారు. కాగా, 2017, 2018లో ముసాయిదా ప్రచురించిన రెండు సందర్భాల్లో పలువురు పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటి వరకు జాబితాలో ఉన్న 3,34,54,384 మంది దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సెప్టెంబరు 7 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్ఆర్సీ అధికారులు తెలిపారు. ఎన్ఆర్సీ కచ్చితత్వంపై సాధారణ ప్రజానీకం, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం సాయం కోరింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మోహరించిన అదనపు బలగాలను ఇక్కడకు తరలించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాట్లుచేసింది. గతేడాది జులై 31న ప్రచురించిన జాతీయ పౌర రిజిస్టర్ ముసాయిదా ప్రకారం 2,89,83,677 మంది ఉండగా, 40,70,707 మందిని అనర్హులుగా తెలిపింది. కానీ, ఈ ఏడాది జూన్ 26 మరో 1,02,462 మందిని అనర్హులుగా పేర్కొన్నారు. విదేశీయులు, అనుమానాస్పద ఓటర్లు, పెండింగ్ కేసులు ఉన్నవారు ఇందులో ఉన్నారు. జూలై 5 తర్వాత విచారణకు పిలవనివారు ఎన్ఆర్సీలో తమ పేరు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తుది ఎన్‌ఆర్‌సి నుంచి మినహాయించడం అంటే ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించడం కాదని, అవసరమైతే దీనిపై విదేశీయుల ట్రైబ్యునల్స్, హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశాలు ఉంటాయి. కోర్టు ఉత్తర్వులతో ఎన్ఆర్సీలో చేర్పులు ఉంటాయి. కాగా, అసోంలో అదనంగా 200 విదేశీయుల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకరించింది. ఎన్ఆర్సీలో అనర్హులుగా ప్రకటించిన వారు ఆర్జీలపై వచ్చే నెలలో ఇవి విచారణ చేపడతాయి. తుది జాబితాలో పెద్ద సంఖ్యలో భారతీయులను అనర్హులుగా పేర్కొంటారని రాజకీయ పార్టీలు ఆరోపించడంతో ప్రస్తుతం ఇది రాజకీరంగు సంతరించుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, సహా పాలక బిజెపి లాంటి ప్రధాన పార్టీలు ఇది ఓ తప్పుల తడకని వ్యాఖ్యానించాయి. ఎన్ఆర్సీలో పేర్లు దక్కనివారిలో ఎక్కువ భాగం బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులేనని బిజెపి భయపడుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కేంద్ర హోం శాఖ ఆగష్టు 20న వెల్లడించిన నోటిఫికేషన్‌లో తుది ఎన్ఆర్సీ జాబితాలో ఒక వ్యక్తి పేరును చేర్చకపోవడం వారిని విదేశీయుడిగా ప్రకటించడం కాదని పేర్కొనడమే దీనికి నిదర్శనమని అంటున్నారు.


By August 31, 2019 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/in-assam-over-3-11-crore-included-more-than-19-lakh-left-out-in-nrc-final-list/articleshow/70920264.cms

No comments