వారి కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను.. వెనక్కు తగ్గను: జగన్
రాష్ట్రంలో దశలవారిగా మద్యపానం నిషేధం అమలుచేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మద్యం విధానంపై నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 1,095 మద్యం దుకాణాలు రద్దు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉండగా, వీటిలో 25 శాతం రద్దుచేయనున్నారు. విడతల వారీగా మద్య నిషేధానికి కార్యాచరణ రూపొందించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు జిల్లాల వారీగా ఏర్పాటుచేయనున్నారు. తాజాగా మద్య నిషేధం విషయంలో మాటిచ్చిన తాను, వెనక్కు తగ్గేది లేదని జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన ఆయన ‘మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్క చెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి" అని పేర్కొన్నారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రిటెయిల్ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి వాటిని లైసెన్సుదారులకు విక్రయించడానికే పరిమితమైన ఈ సంస్థ ఇకపై నేరుగా మద్యం దుకాణాలు నడుపుతుంది. దశలవారీ మద్యనిషేధం అమల్లో భాగంగా మద్యం దుకాణాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించింది. అందుకు అవసరమైన చట్ట సవరణ చేశారు. ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు 1 నుంచి అమలు చేయనుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండవు.
By July 25, 2019 at 10:26AM
No comments