Breaking News

అసెంబ్లీలో జగన్‌ను అల్లా, జీసెస్‌తో పోలుస్తూ ప్రశంసలు.. విమర్శలపై మంత్రి వివరణ!


ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జులై 24న పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లోని ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు కేటాయించే బిల్లును కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ను ముస్లింలకు అల్లాగా, క్రైస్తవులకు జీసెస్‌గా, ఎస్సీలకు అంబేడ్కర్‌గా వర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు. అయితే, సభలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. జగన్‌ను అల్లాతో పోల్చడాన్ని టీడీపీ మైనార్టీ సెల్ నేత ఫతావుల్లా తీవ్రంగా తప్పుపట్టారు. అల్లాతో ఎవరినీ పోల్చకూడదని ఖురాన్ చెబుతుందని, అలాంటి అల్లాతో జగన్‌ను పోల్చడమేంటి? అని ప్రశ్నించారు. అల్లాతో జగన్‌ను పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో ఉన్న నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలూ కూడా ఎందుకు ఖండించలేదని నిలదీశారు. పలు సంఘాలు సైతం మంత్రి పోగడ్తలను తప్పుబట్టాయి. దీంతో మంత్రి జయరాం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నామినేటెడ్‌ పదవులు, పనులు, సర్వీసుల్లో 50 శాతం వాటా కల్పించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలు మారుస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతగా ఆయన దేవుడులాంటి వ్యక్తి అని చెప్పడానికి పోలిక చేశానే తప్ప తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా జులై 24న తాను చేసిన వ్యాఖ్యలు ముస్లిం మైనారిటీలకు మనస్తాపం కలిగించినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిపై విచారాన్ని వ్యక్తం చేస్తూ బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. తన వ్యాఖ్యలతో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాను మంత్రిస్థానంలో తాను ఉన్నానంటే అందుకు కారణం వైఎస్‌ జగన్‌ అన్న జయరాం.. తాము మంత్రులు కావాలని బ్రహ్మరాత రాశాడో లేదో తెలియదు కానీ, జగన్‌ అన్న మాత్రం ఆ రాత తమ నుదుటిమీద రాశారని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ అంటే తనకు ప్రేమ ఎక్కువని, ఆయనను తాను అన్నా అని పిలుస్తానని వివరించారు. 2017లో పాదయాత్ర చేస్తుండగా జగనన్నను కలిశానని, మీరు మాపాలిట దైవసంకల్పమని ఆయనకు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను వాల్మీకి బోయ కులానికి చెందినవాడినని, తమ బోయ కులస్తులకు వైఎస్‌ జగన్‌ వాల్మీకి మహర్షి అంతటి వారని పేర్కొన్నారు.


By July 27, 2019 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-labour-minister-jayaram-apologizes-for-his-comments-on-assembly/articleshow/70406514.cms

No comments