ఏపీకి తొలి గవర్నర్‌గా నేడే బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారి ప్రత్యేక గవర్నర్‌ను కేంద్రం నియమించింది. ఏపీ గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయంచనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ వ్యవహరించారు. అయితే, ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొత్త గవర్నర్ సాయంత్రం విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్ హరించదన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్న గవర్నర్.. సాయుధదళాల గౌరవవందనం అందుకున్నారు. ఏపీ సీఎస్, గవర్నర్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా సహా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్‌ను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సాదరంగా ఆహ్వానించగా, వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేదపండితులు వారికి ఆశీర్వచనం చేశారు. కాగా, గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్ గవర్నర్‌తో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. మధ్యాహ్నం వయోవృద్ధుల క్యూ లైనులో ఆలయంలోకి సతీసమేతంగా ప్రవేశించిన ఆయనకు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి సాదరంగా సన్నిధికి ఆహ్వానించారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్, ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ, ఆలయ ప్రాశస్త్యం, పారిశుద్ధ్యం, లడ్డూ ప్రసాదాల తయారీ, పరకామణి తదితర అంశాలపై ఈవో ద్వారా హరిచందన్ తెలుసుకున్నారు.
By July 24, 2019 at 08:10AM
No comments