బీజేపీ నేత గోకరాజుకు నోటీసులు.. సీఆర్డీఏకి హైకోర్టు కీలక ఆదేశాలు
నిబంధనలకు విరుద్దంగా కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. అక్కడ చంద్రబాబు నివాసం సహా 28 భవనాల యజమానులకు జూన్ చివరి వారంలో సీఆర్డీఏ నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేకపోతే భవనాలు తొలగిస్తామని అందులో పేర్కొన్నారు. సీఆర్డీఏ జారీచేసిన నోటీసుల్లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గెస్ట్‌హౌస్ కూడా ఉంది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ గోకరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు కరకట్టపై నిర్మించిన భవనాల తొలగింపు విషయమై జారీచేసిన నోటీసులపై అఫిడ్‌విట్ దాఖలు చేయాలని సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కె విజయలక్ష్మీ తదుపరి విచారణను జులై 29కి వాయిదా వేశారు. సీఆర్డీఏ నోటీసులపై స్టేకి నిరాకరించారు. ఉండవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 30లో 0.407 హెక్టార్ల విస్తీర్ణంలో గోకరాజు గంగరాజు 2007లోనే ఫాంహౌజ్ నిర్మించారు. కొత్త ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ కట్టడాలకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. కరకట్ట వెంబడి 100 మీటర్లలోపు 50 అక్రమ కట్టడాలు గుర్తించిన అధికారులు వారికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. కాగా, చంద్రబాబు హయాంలో కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనికి సమీపంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ సైతం నదీగర్భంలోనే నిర్మించారని, దీనిని బాబు తక్షణమే ఖాళీచేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ సమావేశల్లోనూ అక్రమ కట్టడాలపై శాసనసభలో వాడి వేడిగా చర్చ సైతం జరిగింది. రాష్ట్రంలోని వివిధ నదులు, కాల్వగట్లపై ఉన్న నిర్మాణాలు, ప్రజావేదిక కూల్చివేత, రోడ్ల మధ్యలో విగ్రహాల ఏర్పాటు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల సమయంలో గత గురువారం చర్చకు వచ్చాయి. ప్రజావేదిక కూల్చి వేతతో రాష్ట్ర వ్యాప్తంగా కాలువ గట్లమీద దశాబ్ధాలుగా నివసిస్తున్న సామాన్య ప్రజానీకం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని టీడీపీ సభ్యులు లేవనెత్తారు. దీనికి ప్రతిగా చంద్రబాబు వల్లే కృష్ణా నది ఒడ్డున పెద్ద సంఖ్యలో అక్రమ భవనాలు వెలిశాయని వైసీపీ వాదించింది. 'అక్రమమైతే కూల్చేస్తారా.. క్రమబద్దీకరించి ప్రజా అవసరాలకు వాడుకోవచ్చుగా.. తమిళనాడులో ఏం చేశారో తెలి యదా?' అని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రి హోదాలో అక్రమాలు ఎలా చేస్తారని, చట్టం ఎవరికైనా ఒకటేనని వైసీపీ జవాబిచ్చింది.
By July 24, 2019 at 08:51AM
No comments