బీజేపీ టార్గెట్ జగన్.. మొన్న పురందేశ్వరి, నిన్న కన్నా!
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి కమలనాథులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణపై 2023 ఎన్నికల్లో జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు ఢంకాబజాయిస్తున్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించారు. ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీని మరింత దెబ్బతీయడానికి కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. టీడీపీకి చెందిన మాజీలతోపాటు తాజాలను కూడా తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకోవడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే, ఇదే సమయంలో అధికార వైసీపీనీ కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ పాలనపై బీజేపీ నేతలు విమర్శలు మొదలుపెట్టినట్టు సమాచారం. రెండు రోజుల కిందట బీజేపీ నేత పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందు నిదర్శనం. విశాఖలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ ఆదేశాలివ్వడం సరికాదన్న పురందేశ్వరి, ఒక మతాన్నో ఒక కులాన్నో కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరించడం సమాజంలో ఘర్షణ వాతావరణానికి కారణమవుతుందని అన్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సైతం జగన్ పాలన సైతం టీడీపీని తలపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీ అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తే వారి పాలన కూడా అదే రీతిలో సాగుతోందని తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన సంఘటన్ పర్వ్- 2019 కార్యక్రమంలో విమర్శించారు. ప్రతి చోట పోలీసుల రాజ్యం నడుస్తోందని కన్నా ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో గ్రామ, మండల స్థాయిల్లో ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలపై పోలీసులు రౌడీ షీట్లు తెరుస్తున్నారని ఆరోపించారు. వారిపై ఎస్సీఎస్టీ కేసులు బనాయించి, బలవంతంగా భూములు లాక్కుంటున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. సమర్థ నాయకత్వం ఉన్న బీజేపీలో సభ్యులుగా చేరేందుకు ముందుకు రావాలని కన్నా పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో కులాలు, కార్పొరేషన్ల పేరుతో విభజన రాజకీయాలు చేశారని.. ఇలాంటి విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు పురందేశ్వరి. వైసీపీ ప్రభుత్వం కూడా తమ తీరు మార్చుకోవాలని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలు చూస్తే జగన్‌కు భవిష్యత్తులో చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది.
By July 20, 2019 at 12:06PM
No comments