Breaking News

పవన్‌కళ్యాణ్‌తో కలిసి పనిచేసే ఉద్దేశం లేదు: రామ్‌మాధవ్


ఆంధ్రప్రదేశ్‌లో ప్రబల రాజకీయ శక్తిగా ఎదగడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ నేత అన్నారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీతో ఆంధ్రప్రదేశ్‌లోజనసేన-బీజేపీ జోడీపై రకరకాల వదంతులు వ్యాపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన జనసేన, బీజేపీ కలిసి పనిచేయనున్నాయని, దీనిపైనే పవన్‌తో రామ్‌మాధవ్‌ చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. జనసేనతో కలిసి పనిచేయడమో లేక ఆ పార్టీని విలీనం చేసుకోవడమో అన్న ఆలోచనలో బీజేపీ ఉందని, దానిపైనే ఇరువురు చర్చలు జరిపారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని రామ్‌మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఏపీలో జనసేనతో కలిసి పనిచేసే ఉద్దేశం బీజేపీకి లేదన్నారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై మాత్రమే పవన్‌తో చర్చించానని, అంతకుమించి ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. మోదీ పాలన చూసి ఏపీలో చాలామంది బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే ఎదిగేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. తాను తానా సభల్లో పాల్గొనేందుకు మాత్రమే అమెరికా వచ్చానని, ఈ పర్యటనకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రామ్‌మాధవ్ పేర్కొన్నారు.


By July 07, 2019 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/there-is-no-intention-of-working-with-pawan-kalyan-says-bjp-leader-ram-madhav/articleshow/70111299.cms

No comments