అనాథను దత్తత తీసుకున్న అనంత కలెక్టర్
జిల్లా కలెక్టరంటే అధికారం చెలాయించడమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని నిరూపించారు అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. తల్లిదండ్రులు మరణించి అనాథగా బతుకుతున్న ఓ బాలుడిని దత్తత తీసుకుని మానవత్వాన్ని చాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఈ నెల 19వ తేదీన గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్‌ను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి వారి కుటుంబ నేపథ్యాలపై ఆరా తీశారు. వారిలో వడ్డే నరసింహులు అనే విద్యార్థి అనాథ అని తెలుసుకుని చలించిపోయారు. నరసింహులు చదువుతో ముందుంటాడని, తల్లిదండ్రులు మరణించడంతో హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడని అధికారులు చెప్పడంతో కలెక్టర్ ఆ విద్యార్థిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం నరసింహులును తన నివాసానికి రప్పించిన కలెక్టర్ ఇకపై అతడి బాధ్యతలన్నీ తానే చూసుకుంటానన్నారు. విద్యార్థిని బీసీ సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో చదివించాలని పాఠశాలల కన్వీనర్ సంగీతను ఆదేశించి ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘అనంత ఆణిముత్యాలు’ పథకం ద్వారా విద్యార్థికి సామాగ్రి అందించడంతో పాటు, చదువు పూర్తయ్యేవరకు సాయం చేస్తానని ప్రకటించారు.
By July 22, 2019 at 09:26AM
No comments