Breaking News

హయత్‌నగర్‌లో యువతి కిడ్నాప్: నిందితుడి కొడుకు, అల్లుడి అరెస్ట్


హయత్‌నగర్‌లో బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ చిరువ్యాపారిని నమ్మించి అతడి కుమార్తెను కారులో ఎత్తుకెళ్లిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాలుగు రోజులైనా కిడ్నాపర్, యువతి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. తమకు లభించిన ఆధారాలను బట్టి కిడ్నాపర్‌ను కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన పాత నేరస్థుడు రవిశేఖర్‌ (45)గా గుర్తించారు. అతడి చెరలో ఉన్న యువతిని రక్షించేందుకు రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ పర్యవేక్షణలో పోలీసులు బృందాలు ముమ్మర గాలింపు చేపడుతున్నాయి. కిడ్నాపర్ మంగళవారం రాత్రి 8.30 గంటలకు యువతితో పాటు పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్ రింగురోడ్డు మీదుగా తుక్కుగూడ వైపు కారులో వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. పోలీసుల విచారణలో కారు కర్ణాటకలోని గుల్బర్గాలో దొంగిలించినట్లు తేలింది. నిందితుడు ప్రయాణించి మార్గాన్ని బట్టి కర్నూలు వైపునకు వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడు స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉండటంతో దావులూరులో నిఘా పెట్టారు. రవిశేఖర్ భార్య ఐదేళ్ల క్రితం మరణించగా, అతడికి కొడుకు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరికీ వివాహాలు అయ్యాయి. రవిశేఖర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అతడి కొడుకు, అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడలో రహస్యంగా విచారిస్తున్నారు. రవిశేఖర్‌పై తెలుగు రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లతో పాటు గుంటూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 26 దొంగతనం కేసులు ఉన్నాయి. నిందితుడు కిడ్నాప్ అపహరణ అనంతరం ఎవరికైనా ఫోను చేశాడా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.


By July 27, 2019 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hayathnagar-girl-kidnap-case-accused-son-and-son-in-law-arrested/articleshow/70406600.cms

No comments