Breaking News

వైఎస్ జగన్ పీఏ పేరుతో వసూళ్లు.. విశాఖ కేటుగాళ్లు అరెస్ట్


ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన పీఏ పేరుతో నాయకులను మోసం చేసిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాకు చెందిన పండరి విష్ణుమూర్తి, గంధవరపు తరుణ్‌, ఎం.జగదీష్‌, పి.జయకృష్ణ ముఠాగా ఏర్పడ్డారు. గతేడాది అక్టోబరులో వై.ఎస్‌.జగన్‌ పీఏ నంబర్ తెలుసుకున్నారు. స్పూఫింగ్ టెక్నాలజీ ద్వారా ఆ నంబర్‌తో ఉత్తరాంధ్రలోని కొందరు నేతలకు ఫోన్ చేసి వైసీపీ టిక్కెట్లు ఇస్తామని బేరాలాడారు. వారి మాటలను నమ్మిన కొందరు నేతలు లక్షల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లలో వేశారు. మరికొందరేమో జగన్ వ్యక్తిగత కార్యదర్శితో మాట్లాడారు. తాము ఎవరికీ ఫోన్ చేయలేదని జగన్ పీఏ చెప్పడంతో అప్పటికే డబ్బులు సమర్పించుకున్న నేతలు మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మోసంపై వైసీపీ జాయింట్ సెక్రటరీ హర్షవర్ధన్‌రెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను కోసం గాలింపు చేపట్టారు. ఇతర నేరాల కింద రాజమహేంద్రవరం పోలీస్‌స్టేషన్లో ఉన్న వీరిని శనివారం పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కొంతకాలంగా ఇదే తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిపై వైజాగ్‌, శ్రీకాకుళం, ముమ్మిడివరంలో కేసులు ఉన్నాయని తెలిపారు.


By July 28, 2019 at 12:58PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/four-vizag-youth-held-for-collecting-money-from-leaders-in-ys-jagan-name/articleshow/70418132.cms

No comments