Breaking News

అమరావతికి ఏఐఐబీ రుణ ఉపసంహరణ.. ప్రచారంపై సీఎంవో స్పందన ఇదీ!


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏఐఐబీ సంయుక్తంగా 500 మిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వాలన్నది ప్రతిపాదన. అయితే, అమరావతికి రుణం ఇవ్వబోమని వరల్డ్ బ్యాంకు ఇటీవల స్పష్టంచేసిన విషయం తెలిసిందే. ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏఐఐబీ) సైతం రుణం ప్రతిపాదన విరమించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు స్పందించాయి. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వంపై కొన్ని మీడియా వర్గాలు పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని సీఎంఓ వర్గాలు ఆవేదన వ్యక్తంచేశాయి. రాజధానికి నిధులు నిలిపివేత అంశంపై శాసనసభలో ప్రభుత్వం స్పష్టమై ప్రకటన చేసినా పదేపదే వ్యతిరేక ప్రచారం జరుగుతుండడంపై విచారం వ్యక్తంచేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే అమరావతికి తన ప్రతిపాదిత రుణాన్ని నిలిపివేసిందని సీఎంఓ వర్గాలు మరోసారి స్పష్టంచేశాయి. తాజాగా ఏఐఐబీ రుణ ప్రతిపాదన ఉపసంహరించుకోవడం ప్రభుత్వానికి మరో దెబ్బగా చేస్తున్న ప్రచారాన్ని మీడియా ప్రతినిధులు సీఎంవో దృష్టికి తీసుకురావడంతో స్పందించాయి. అమరావతికి ప్రతిపాదిత రుణ ప్రాజెక్టులో వరల్డ్‌ బ్యాంకుతో పాటు ఏఐఐబీ కూడా భాగస్వామి అని వెల్లడించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టులోని భాగస్వాములందరికీ వర్తిస్తుందని సీఎంఓ వర్గాలు వివరించారు. ఏఐఐబీ వ్యవహారాన్ని విడిగా చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించడం శోచనీయమని పేర్కొంది. అమరావతి సుస్థిర మౌలిక వసతులు, సంస్థాగత అభివృద్ధి ప్రాజెక్టు అంచనా వ్యయం 715 మిలియన్‌ డాలర్లు. దీనిలో ప్రపంచబ్యాంకు 300 మిలియన్‌ డాలర్లు, ఏఐఐబీ 200 మిలియన్‌ డాలర్లు రుణంగా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం రూపాయి మారకపు విలువ ప్రకారం చూస్తే ఇది రూ.3,450 కోట్లు. మిగతా 215 మిలియన్‌ డాలర్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలన్నది ప్రతిపాదన. అమరావతికి రుణం విజ్ఞప్తిని వెనక్కు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఏఐఐబీ సైతం నిర్ణయం తీసుకుంది.


By July 24, 2019 at 10:02AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cmo-responds-to-spreading-rumours-about-aiib-drops-amaravati-project/articleshow/70356951.cms

No comments