Breaking News

వెంటాడిన మృత్యువు.. 58 రోజుల తర్వాత మరో ప్రమాదంలో రాజమొగిలి మృతి


ఓ ప్రమాదం నుంచి బయటపడి అందరిచేతా మృత్యుంజయుడని పిలుపించుకున్న వ్యక్తి సరిగ్గా రెండు నెలల తర్వాత మరో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘటనలో 30 గంటల పాటు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపి బయటపడిన అతడు ఓ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌ జిల్లా మండలం మడిపల్లికి చెందిన వ్యాపారి వజ్ర రాజమొగిలి (60) ఈ ఏడాది మే 31వ తేదీన బంధువుల ఇంటికి వెళ్లి తెల్లవారుజామున బైక్‌పై హన్మకొండ నుంచి జమ్మికుంటకు బయలుదేరాడు. వరంగల్ అర్బన్ జిల్లా ముచ్చర్ల నాగారం సమీపంలో అతడి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. బావిలో సుమారు 30 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపిన రాజమొగిలి కేకలు విని సమీపంలోని వ్యవసాయ కూలీలు రక్షించారు. బావిలో బైక్‌తో సహా పడిపోయి 30 గంటలు ఉన్నా అతడు ప్రాణాలతో బయటపడటంపై అంతా ఆశ్చర్యపోయారు. అతడు మృత్యుంజయుడని కొనియాడారు. Also Read: అయితే రాజమొగిలిని వెంటాడుతూ వచ్చిన మృత్యువు చివరికి అతడిని 58రోజుల తర్వాత బలి తీసుకుంది. ఓ పని నిమిత్తం రాజమొగిలి శుక్రవారం కాగజ్‌నగర్‌కు ఇంటర్‌సిటీ రైల్లో బయలుదేరాడు. బెల్లంపల్లి సమీపంలోని రెచిన్‌రోడ్ స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో రాజమొగిలి మూత్ర విసర్జన కోసం రైలు దిగాడు. అవతలి వైపునకు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా మరో రైలు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రెండు నెలల క్రితం మృత్యువును జయించిన రాజమొగిలి మరో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


By July 27, 2019 at 09:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/karimnagar-man-died-after-train-collides-in-bellampalli/articleshow/70405399.cms

No comments