Breaking News

మనస్వికి 5గంటల పాటు సర్జరీ.. 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమంటున్న డాక్టర్లు


హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ బృందావన్‌ లాడ్జిలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన మనస్వి(22) పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి వైద్యులు సుమారు 5గంటల పాటు సర్జరీలు చేశారు. ఆమె మెడపై గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైందని, పెనుగులాటలో చేతివేళ్లు కూడా కోసుకుపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. మనస్వికి చికిత్స అందిస్తున్నామని, 48 గంటలు గడిస్తేనే గానీ ఏమీ చెప్పలేమని పేర్కొంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. బడంగ్‌పేట నవయుగ ఎన్‌క్లేవ్‌లో ఉండే ప్రభుత్వ ఉద్యోగి ఆనంద్‌బాబు కుమార్తె మనస్వి ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. నెల్లూరులోని నారాయణరెడ్డిపేటకు చెందిన జాన వెంకటేశ్‌(23) కూడా అదే సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మనస్విపై మనసు పారేసుకున్న వెంకటేష్ ఈ విషయాన్ని ఆమెకు చెప్పగా తిరస్కరించింది. మనస్వి తనను దూరం పెడుతోందని కక్ష పెంచుకున్న వెంకటేష్ తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని అనుకున్నాడు. పథకం ప్రకారం వెంకటేష్ మంగళవారం ఉదయం నెల్లూరు నుంచి దిల్‌సుఖ్‌నగర్ చేరుకున్నాడు. బృందావన్‌ లాడ్జిలో 501 రూమ్‌లో దిగి మాట్లాడుకుందాం రా అని మనస్విని పిలిచాడు. మధ్యాహ్న సమయంలో లాడ్జికి వచ్చిన ఆమె వెంకటేష్‌ రూమ్‌కి వెళ్లింది. అతడి ప్రవర్తననతో భయపడిపోయిన ఆమె తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఈలోగా కాల్ కట్ కావడంతో సోదరుడు నావిగేషన్ ద్వారా మనస్వి ఉన్న లాడ్జికి తల్లితో కలిసి చేరుకున్నాడు. రెండో అంతస్తులో ఉన్న 501 రూమ్‌కి వెళ్లి చూడగా మనస్వి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో ఆమెను వెంటనే కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు. మెడ చుట్టూ కత్తితో కోసేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, శ్వాసనాళం వరకు గాట్లు పడ్డాయని డాక్టర్లు చెప్పారు. మనస్విపై దాడి చేసిన అనంతరం వెంకటేష్ తానుకూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంకటేశ్‌ను ఉస్మానియాకు తరలించారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు దిల్‌సుఖ్‌నగర్ పోలీసులు తెలిపారు.


By July 10, 2019 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-love-attack-manaswi-condition-is-serious/articleshow/70153150.cms

No comments