Breaking News

మొత్తం 4 లక్షల ఉద్యోగాలు.. ఇదో రికార్డ్, అంతా మీ ఆశీర్వాదమే: జగన్ ట్వీట్


ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో తనదైన ముద్రవేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన నవరత్నాల అమలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్రామ వలంటరీ వ్యవస్థను ప్రారంభిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ చొప్పున నియమించి, వారి ద్వారా సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. ఇక, గ్రామ సచివాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,068 గ్రామసచివాలయాలు ఏర్పాటుచేయున్నారు. ఒక్కో సచివాలయంలో 10 మంది ఉద్యోగులను నియమిస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల కిందట పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ జారీచేసింది. ఈ అంశంపై తాజాగా, ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. Read Also: అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.01 లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, ఇదో రికార్డని జగన్ పేర్కొన్నారు. పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పుగా గ్రామ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నామని, ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమవుతోందంటూ ట్వీట్ చేశారు. ‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తున్నాం. మీ ఆశీర్వాదబలంవల్లే ఇది సాధ్యమవుతోంది’ అంటూ ట్విట్టర్‌లో అన్నారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఉద్యోగాలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 91,652 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గ్రామ సచివాలయ పోస్టుల భర్తీకి జులై 22న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జులై 23 నుంచి సెప్టెంబరు 15 మధ్య నియామక ప్రక్రియ, ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేస్తారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులకు సెప్టెంబరు 16 నుంచి 28 వరకు బాపట్ల, సామర్లకోట, కాళహస్తిలోని పంచాయతీ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నారు. సెప్టెంబ‌రు 20 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌక‌ర్యాల‌తో స‌చివాల‌యాలను సిద్ధం చేస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబ‌రు 30న సచివాలయాలను కేటాయించనున్నారు.


By July 21, 2019 at 11:57AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-cm-jagan-tweet-on-volunteer-posts-and-other-govt-jobs/articleshow/70314575.cms

No comments