‘మన్మథుడు 2’ ట్రైలర్: వామ్మో.. లిప్‌లాకులు!!
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ముఖ్యంగా ఆ కాలం అమ్మాయిలైతే అస్సలు మరిచిపోరు. ఎందుకంటే, ఈ సినిమాతో నాగార్జున మన్మథుడికి కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. ఆయన అందం, పంచ్ డైలాగులు, కామెడీ ఇవన్నీ ‘మన్మథుడు’ సినిమాకు ప్రధాన బలాలు. ఆ సూపర్ హిట్ సినిమాను తలపిస్తూ సుమారు 17 ఏళ్ల తరవాత ఇప్పుడు ‘మన్మథుడు 2’ను తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లిన మన్మథుడిగా కనిపించబోతున్నారు. ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాపై ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది ట్రైలర్. నాగార్జున స్టైల్లో రొమాన్స్, వెన్నెల కిషోర్, రావు రమేష్ కామెడీ, మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా ఇవన్నీ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. ఆ మన్మథుడు మాదిరిగానే ఈ ‘మన్మథుడు 2’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించేలా కనిపిస్తున్నాడు. ‘అద్భుతం.. అమోఘం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు. హమ్మీ గో..’ అంటూ కారులో వెన్నెల కిషోర్ పక్కన కూర్చొని మంచి జోష్‌తో నాగార్జున చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ‘మీరెప్పుడూ ప్రేమలో పడలేదా?’ అని రకుల్ అడిగితే.. ‘ఒకపూట భోజనం కోసం వ్యవసాయం చేయలేను’ అంటూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు నాగ్. ‘ఏ అమ్మాయి బాగానే ఉన్నావుగా.. ఈడ్ని చేసుకుంటున్నావేంటి? ఏ కేస్టు’ అంటూ రావు రమేష్ వెటకారంగా విసిరే పంచ్ డైలాగులు ట్రైలర్‌లో మరో హైలైట్. ఈ పాత్ర చూస్తుంటే రావు రమేష్ మరోసారి తన వెటకారంతో కడుపుబ్బా నవ్వించేలా కనిపిస్తున్నారు. ఇవన్నీ పక్కనపెడితే.. 50 పైబడిన వయసులోనూ నాగ్ రొమాన్స్ ఆడియన్స్‌ను పిచ్చెక్కించడం ఖాయం. విదేశీ భామలతో ఆయన లిప్‌లాకులు కూడా చేసేశారు. మొత్తంగా చూసుకుంటే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ‘చి.ల.సౌ’తో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్.. ఈ సినిమాతో వరుసగా రెండో హిట్టు కొట్టేలా ఉన్నారు. ఆయన సినిమాను చాలా బాగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతోంది. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత చిన్న అతిథి పాత్రలు పోషించారు. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్(జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.
By July 25, 2019 at 12:02PM
No comments