'పబ్లిసిటీ పిచ్చితో 29మంది బలి.. బోయపాటికి షూటింగ్ చేయమని చెప్పింది ఎవరు'
పబ్లిసిటీ పిచ్చికి 29మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, జక్కంపూడి రాజా. ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పుష్కరాల నిర్వహణపై వైసీపీ సభ్యులు మంత్రిని వివరణ కోరారు. పుష్కరాల పేరు చెప్పి టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా రూ.వేల కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. పుష్కరాలపై పబ్లిసిటీపై పెట్టిన దృష్టి ఏర్పాట్లపై లేదన్నారు. నిధుల్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గోదావరితో పాటూ కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. పుష్కరాల జరుగుతున్న సమయంలో 29 మంది అమాయకుల మరణానికి కారణం ఎవరని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. డైరెక్టర్ బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు.. బోయపాటిని చంద్రబాబు షూటింగ్ చేయమన్నారా.. ఆయనే సినిమా షూటింగ్ చేశారా అంటూ ప్రశ్నించారు. అసలు బోయపాటి శ్రీనుకు పుష్కరాలతో ఏం సంబంధమన్నారు. వీఐపీ ఘాట్ పక్కనే ఉన్నా.. చంద్రబాబు ఎందుకు సాధారణ భక్తుల కోసం కేటాయించిన ఘాట్‌లో పుష్కర స్నానం చేశారని ప్రశ్నించారు. 29మంది చనిపోయినా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదన్నారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి గత ప్రభుత్వ కారణమని ఆరోపించారు ఎమ్మెల్యేలు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణమని విమర్శించారు ఎమ్మెల్యేలు. భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత ప్రభుత్వం సమర్ధించుకుందని.. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదికను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని.. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. అసలైన దోషులను గుర్తించాలన్నారు. పుష్కరాల వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. దీనిపై కేబినెట్ సబ్‌కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం బయటకు రాకుండా చేసిందన్నారు. మృతుల కుటుంబసభ్యులు కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారన్నారు.
By July 24, 2019 at 11:50AM
No comments