Breaking News

ముంబై: వరద నీటిలో మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ రైలు.. లోపల 2000 మంది ప్రయాణీకులు


ముంబైలో మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో సగటున 150 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నగర పరిసర ప్రాంతాల్లో 50 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా శాంతాక్రూజ్‌లో 192 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై వర్షం నీరు నిలిచి జలాశయాలను తలపిస్తున్నాయి. ఏడు విమానాలను రద్దుచేయగా, పలు సర్వీసులను దారి మళ్లించారు. దీంతో ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. సముద్రం తీరానికి దూరంగా ఉండాలని, మ్యాన్‌హోల్స్ తెరవద్దని ప్రజలకు బీఎంసీ అధికారులు సూచించారు. రైల్వే ట్రాక్‌పై నీరు ప్రవహించడంతో ముంబై-కొల్హాపూర్ మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ రైలు బద్లాపూర్- వాంగనీ మధ్య వరద నీటిలో చిక్కుకుపోయింది. ఈ రైల్లో 2000 మంది ప్రయాణీకులున్నట్టు సెంట్రల్ రైల్వే డీఆర్ఎం వెల్లడించారు. వాన నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ప్రయాణీకులు ఎవరూ రైల్లో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు వాతావరణం ఆటంకంగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, బద్లాపూర్, ముంబై అగ్నిమాక విభాగాలకు చెందిన మొత్తం ఎనిమిది సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు 500 మందిని బయటకు తీశారు. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తేవడానికి లైఫ్ జాకెట్లు, బోట్లు, హెలికాప్టర్ సైతం వినియోగిస్తున్నారు.


By July 27, 2019 at 12:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mumbai-kolhapur-mahalaxmi-express-is-stranded-between-vangani-and-badlapur/articleshow/70407011.cms

No comments