Breaking News

‘బీజేపీలో చేరిన ఆ టీడీపీ ఎంపీల మీద ఆరోపణలే.. కేసులులేవు’


టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికిపాటి రామ్మోహన్ రావులు బీజేపీలో చేరి, తమను అందులో విలీనం చేయాలని కోరిన విషయం తెలిసిందే. నలుగురు ఎంపీల కోరిక మేరకు బీజేపీలో విలీనం చేస్తూ రాజ్యసభ ఛైర్మన్, ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఉప-రాష్ట్రపతి చర్యలు రాజ్యాంగ విరుద్దమని మండిపడుతోంది. ఈ విమర్శలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి స్పందించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ కార్యదర్శి భానుప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియలో రాజ్యాంగానికి అనుగుణంగానే రాజ్యసభ ఛైర్మన్‌ తి వెంకయ్యనాయుడు వ్యవహరించారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు నిబంధన ప్రకారం రాజ్యసభలో ఇప్పటివరకు 16 సార్లు విలీన ప్రక్రియలు జరిగాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యాంగబద్ధంగానే బీజేపీలో ఇటీవల విలీనం అయ్యారని పేర్కొన్నారు. గతంలో ఎన్నో సందర్భాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన టీడీపీ, కాంగ్రెస్‌కు బీజేపీని విమర్శించే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీలోకి వచ్చిన ఆ నలుగురు టీడీపీ ఎంపీలపై ఆరోపణలు తప్ప ఛార్జిషీట్లు, కేసులు లేవని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, ఏపీ బీజేపీ ఉపాధ్యాక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఇదే విధంగా మాట్లాడటం విశేషం. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరగానే అపవిత్రులుగా మారిపోయారా అని మండిపడ్డారు. టీడీపీలో ఉన్నంతకాలం పునీతులు.. పార్టీ మారాక అపవిత్రులయ్యారా అని ఆయన నిలదీశారు. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌ కేసులు నమోదై జైలుకు వెళ్లలేదని, వారిపై విచారణ మాత్రమే జరుగుతోంది. సంబంధం లేని కంపెనీల కేసుకు సంబంధించి సుజనా చౌదరిని సీబీఐ విచారణకు పిలిచారని, సీఎం రమేష్‌పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు.


By June 24, 2019 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/union-minister-kishan-reddy-responds-about-tdp-mps-join-in-bjp/articleshow/69921946.cms

No comments