Breaking News

ఆ ఇంటిని బాబు తక్షణమే ఖాళీచేయాలి.. అయినా వదిలిపెట్టను: ఆళ్ల


టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదికను ప్రభుత్వం కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ఈ భవనం కూల్చివేతతో అక్కడ ఉద్రిక్త నెలకుంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎమ్మెల్యే అక్కడకు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారని, ప్రజా వేదిక కూల్చివేత తర్వాతైనా ఆయన తక్షణం ఆ భవనాన్ని ఖాళీ చేయాలని ఆళ్ల సూచించారు. ప్రజా వేదిక కూల్చివేతను జనం హర్షిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో అక్రమ కట్టడంలో ఉన్న బాబు ఇంకా అక్కడే ఉండాలని అనుకోవడం అన్యాయమని దుయ్యబట్టారు. అయినా చంద్రబాబును తాను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న ఆళ్ల, కరకట్టమీద 60కిపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటికీ నోటీసులు జారీ చేయించామని తెలిపారు. వాస్తవానికి జూన్ 21నే ఈ కేసులన్నీ న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉందని, అయితే వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సమర్థుడని ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందుకున్న వారంతా వాటిని ఖాళీ చేయాలని, జగన్‌ మంచి మనసును అర్థం చేసుకుని వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులను బెదిరించి బలవంతగా వారి వద్ద నుంచి స్థలం లాక్కుని ప్రజావేదికను నిర్మించారని ఆళ్ల విమర్శించారు. ఈ స్థలం ఇవ్వాలని నాటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్‌లు రైతులు దాసరి నాగయ్య, దాసరి సాంబశివరావులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. చివరికి బెదిరించి, భయపెట్టి ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. సీఆర్డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి 2015లో తహసీల్దార్‌, 2016లో హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా వాటిని బాబు పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగించారని తెలిపారు. కూల్చేవేతపై రాద్ధాంతం అనవసరమని, చట్టాలకు ఎవరూ అతీతులు కాదని రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు.


By June 26, 2019 at 11:31AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ycp-mla-alla-ramakrishna-reddy-allegations-on-chandrababu-over-praja-vedika-demolition/articleshow/69953903.cms

No comments