Breaking News

కేసీఆర్, జగన్ మరోసారి భేటీ.. ప్రధాన అజెండా ఇదే!


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు , జగన్‌లు జూన్ 28న మరోసారి సమావేశం కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరు ఇరువురూ కలవడం ఇది నాలుగోసారి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గోదావరి నదీ జలాల వినియోగంపై కేసీఆర్, జగన్‌ మధ్య చర్చ జరిగింది. సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి కృష్ణా నదిలోకి మళ్లించాలన్న ఆలోచనకు మరింత పదును పెరుగుతోంది. దీనిపై కసరత్తు చేస్తున్న ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి, ఏపీలో ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగు నీరు సక్రమంగా అందజేయాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై చర్చిస్తున్నారు. ఇక, గోదావరిలో ఇంద్రావతి కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని, ఇరు రాష్ట్రాలు సహకారంతో కరవు జిల్లాలకు వరద జలాలను వినియోగించుకోవచ్చని కేసీఆర్‌ సూచించారు. ఈ సూచనకు సానుకూలంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, దీనిపై ఉన్నతస్థాయి అధికారులతోనూ చర్చించారు. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం నీటి మళ్లింపు సామర్థ్యాన్ని రోజుకు ఒక టీఎంసీకి పెంచడంపైనా సీఎంల మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి జూన్ 28న హైదరాబాద్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు దీనికి సంబంధించిన ఎజెండా ఇతర అంశాలపై సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించడంపైనే కేసీఆర్, జగన్ మధ్య ప్రధాన చర్చ ఉంటుందని భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. గోదావరికి వరద వచ్చే మూడు నెలల సమయంలో 250 నుంచి 300 టీఎంసీల నీటిని మళ్లించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నీటి అవసరం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం, కృష్ణా బేసిన్‌లో లభ్యమయ్యే నీరు, అదనంగా ఎంత అవసరం అనే అంశాలు ఆధారంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. జల వివాదాలకు సంబంధించిన ఇతర అంశాలకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, జూన్ 28న భేటీ గురించి అధికారికంగా సమాచారం లేకున్నా సీఎంల సూచన మేరకు రెండు రాష్ట్రాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తోనూ, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుతో చర్చించారు. నీటిని మళ్లించే ప్రతిపాదనల గురించి ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఇంజినీర్లు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకొంటున్నారు.


By June 25, 2019 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/andhra-and-telangana-cm-jagan-kcr-will-meet-again-on-june-28th-at-hyderabad/articleshow/69936046.cms

No comments