Breaking News

ప్రతిపక్ష నేత కనిపించుట లేదు.. ఆచూకీ చెబితే రూ.5,100 పారితోషికం!


బీహార్‌లో మెదడువాపు వ్యాధితో ఇప్పటి వరకు దాదాపు 130 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సమయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనకు వెళ్లిపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెదడువాపు వ్యాధితో చిన్నారులు వరుసగా మృత్యువాత పడుతున్నప్పటికీ నేత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో తేజస్విపై వ్యతిరేకతను వినూత్నంగా వ్యక్తం చేస్తున్నారు. తేజస్వి యాదవ్ ఆచూకీ చెప్పిన వారికి రూ.5,100 బహుమతిగా ఇస్తామంటూ పోస్టర్ ముద్రించి ప్రదర్శించడం కలకలం రేగుతోంది. ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న తేజస్వి యాదవ్‌ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయంలో విదేశాలకు వెళ్లిపోవడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పోస్టర్‌ దర్శన మివ్వడం చర్చనీయాంశంగా మారింది. చిన్నారుల మరణాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ స్థానిక సామాజిక ఉద్యమకారిణి తమన్నా హష్మీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో తేజస్వీ కనిపించడం లేదంటూ పోస్టర్ వేయించాడు. లోక్‌సభ ఫలితాలు వెల్లడి తర్వాత కనిపించకుండా పోయిన తేజస్వీ యాదవ్ ఆచూకీ తెలిపిన వారికి రూ.5,100 పారితోషికం ఇస్తామని తెలిపారు. తేజస్వి యాదవ్‌ ఎక్కడున్నారో ఇప్పటికీ ఆర్జేడీ నేతలకు తెలియకపోవడం గమనార్హం. తేజస్వీకి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు లండన్‌ వెళ్లారని ఆ పార్టీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ తెలిపారు. అయితే, వ్యక్తిగత పనిమీద అస్ట్రేలియా వెళ్లారు మరి కొందరు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడున్నా ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మెదడు వాపు వ్యాధి లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ఆసుపత్రిలో చిన్నారుల చికిత్సకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల కుటుంబాలు, బంధువుల కోసం ‘ధర్మశాల’ పేరిట వసతి ఏర్పాటు చేయాలని వివరించారు. ముజఫర్‌పూర్‌లో ఇప్పటివరకు 250 మందికిపైగా చిన్నారులు ఈ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు.


By June 22, 2019 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/social-activist-the-gigantic-poster-against-rjd-leader-tejashwi-yadav-in-bihar/articleshow/69900208.cms

No comments