Breaking News

‘రాజుగారి గది 3’.. ఈసారి తమన్నాను నమ్ముకున్న ఓంకార్


ఓంకార్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం ‘రాజుగారి గ‌ది’ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. తన తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి ఓంకార్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చిన్న స్టార్లతో పెద్ద విజయం సాధించిన ఓంకార్.. దానికి సీక్వెల్‌గా తీసిన ‘రాజుగారి గది 2’లోకి మాత్రం నాగార్జున, సమంత లాంటి పెద్ద స్టార్లను తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో సినిమాను ఓంకార్ తెరపైకి తీసుకొచ్చారు. ఈసారి మిల్కీ బ్యూటీ తమన్నాను ఆయన నమ్ముకున్నారు. ‘రాజుగారి గ‌ది 3’ గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హాజ‌రై ముహూర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు. స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘రాజుగారి గ‌ది 3’లో త‌మ‌న్నా ప్రధాన పాత్రలో న‌టిస్తుండ‌గా అశ్విన్ ముఖ్య పాత్రలో న‌టిస్తున్నారు. ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, హ‌రితేజ‌, అజ‌య్‌ ఘోష్ ఇత‌ర పాత్రల్లో న‌టిస్తున్నారు. శుక్రవారం నుంచి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ సినిమాకి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయిమాధ‌వ్ బుర్రా మాటలు రాస్తున్నారు. గౌతంరాజు ఎడిటింగ్‌ బాధ్యతలు చూసుకుంటున్నారు.


By June 20, 2019 at 12:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tamannaah-and-director-ohmkars-raju-gari-gadhi-3-launched/articleshow/69871080.cms

No comments