Breaking News

‘రెడ్డి గారి అబ్బాయి’ టైటిల్ ఎలా ఉంది?


సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు-అశ్వనీదత్‌-పివిపి వంటి ముగ్గురు అగ్రనిర్మాతల భాగస్వామ్యంలో ‘మహర్షి’ చిత్రం చేశాడు. మొదట్లో డివైడ్‌ టాక్‌తో పాటు నిడివి, కొన్ని అతిశయోక్తుల మీద విమర్శలు వచ్చినప్పటికీ పోటీలో మరో చిత్రం ఏదీ లేకపోవడం... వేసవి సెలవుల కారణంగా ‘మహర్షి’ చిత్రం మంచి వసూళ్లూ సాధిస్తోంది. ఈ చిత్రం చూసిన అభిమానులు కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతారని ఇటీవల ఫంక్షన్‌లో తెలిపిన మహేష్‌ తాను కూడా కాలర్‌ ఎగరేసి మరీ చెప్పాడు. 

ఇక ‘మహర్షి’ జోరు తగ్గడంతో ఇప్పుడు అందరి చూపు మహేష్‌బాబు నటించే 26వ చిత్రంపై ఉంది. ఈ చిత్రానికి పటాస్‌, సుప్రీం, రాజా ది గ్రేట్‌, మరీ ముఖ్యంగా ఎఫ్‌2 వంటి మంచి విజయాలను అందించి ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకునిగా పేరు తెచ్చుకున్న అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. దిల్‌రాజుతో పాటు మహేష్‌తో 1(నేనొక్కడినే), ఆగడు వంటి ఫ్లాప్‌లను అందుకున్న అనిల్‌సుంకర భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు, ఆగడు చిత్రాలకు అనిల్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. 

ఇక విషయానికివస్తే వరుసగా భరత్‌ అనే నేను, మహర్షి వంటి మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రాలను చేసిన మహేష్‌ జస్ట్‌ ఫర్‌ ఎ ఛేంజ్‌ కోసం అన్నట్లుగా అనిల్‌రావిపూడి చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నడస్తుందని, ఇందులో మహేష్‌ రాయలసీమ యువకునిగా కనిపించనున్నాడని సమాచారం. అందుకే ఇటీవల ఈ చిత్రం యూనిట్‌ కర్నూల్‌తో సహా పలు రాయలసీమ లొకేషన్లను పరిశీలించింది. ఒక్కడు చిత్రంలో కనిపించిన కర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని సీన్స్‌ని తీయనున్నారు. ఈ చిత్రం కోసం ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఈ మేరకు దిల్‌రాజు ఈ టైటిల్‌ని ఫిల్మ్‌చాంబర్‌లో రిజిష్టర్‌ కూడా చేయించాడని సమాచారం. ఫ్యాక్షన్‌ నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని కమర్షియల్‌, యాక్షన్‌ సీన్స్‌తో పాటు పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిల్‌రావిపూడి తెరకెక్కించనున్నాడు. 

ఇక ‘మహర్షి’ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని మ్యూజికల్‌ హిట్‌గా నిలపలేకపోయాడని, కాబట్టి దేవిశ్రీని కాకుండా తదుపరి చిత్రాలకు థమన్ ని పెట్టుకోవాలని మహేష్‌ అభిమానులు కోరారు. కానీ దేవిశ్రీని ‘మహర్షి’ వేడుకలో మహేష్‌ ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు.. ఈ చిత్రం నిర్మాతల్లో ఒరు దిల్‌రాజు కావడంతో ఈ మూవీకి కూడా దేవిశ్రీనే ఖరారు చేశారని సమాచారం. 



By May 19, 2019 at 01:33PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45994/mahesh-babu.html

No comments