Breaking News

రికార్డ్స్ కాదు దేవిశ్రీ.. నాణ్యత ముఖ్యం!


తెలుగులో ప్రస్తుతం నెంబర్‌వన్‌ సంగీత దర్శకుడు ఎవరు అంటే ఎవరైనా దేవిశ్రీప్రసాద్‌ అనే అంటారు. కానీ ఈమధ్య సినిమాలకు ఆయన తన స్థాయి సంగీతం అందించడం లేదనే విమర్శలున్నాయి. అయినా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు లేకపోయినా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వంటి వారు ప్రత్యామ్నయం చూసుకుంటున్నారు. అనిరుధ్‌ ‘జెర్సీ’తో తన సత్తా చాటాడు. ముఖ్యంగా బిజీఎంలో థమన్ హవా మామూలుగా లేదు. ఇలాంటి తరుణంలో ఒకప్పుడు ఏ వయసు వారినైనా హమ్‌ చేయిస్తూ కాళ్లుచేతులు కదపకుండా ఉండలేకుండా చేసిన ఘనత దేవిశ్రీది. 

ఆయన ఆడియో వేడుక అంటే ఆయనే డ్యాన్స్‌ చేస్తూ, తానే పాడుతూ ఉర్రూతలూగించేవాడు. కొంతకాలం ఆయన హీరోగా దిల్‌రాజు, సుకుమార్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం అంటూ వార్తలు వచ్చాయి. కానీ అవి పట్టాలెక్కలేదు. ముఖ్యంగా దేవిశ్రీ తన తండ్రి మరణం తర్వాత సంగీతం మీద సరిగా మనసు పెట్టడం లేదా? అనే అనుమానాలు ‘వినయ విధేయ రామ’తో పాటు ‘మహర్షి’ ఆల్బమ్‌ విన్నా అనుమానం వస్తోంది. 

ఇక విషయానికి వస్తే తాజాగా దేవిశ్రీప్రసాద్‌ తాను సాధించిన రేర్‌ ఫీట్‌ని తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాస్టార్‌ చిరంజీవి, కోలీవుడ్‌స్టార్‌ సూర్య, తాజాగా మహేష్‌బాబుల అరుదైన చిత్రాలకు సంగీతం అందించిన ఆనందాన్ని పంచుకున్నాడు. ఎన్టీఆర్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఎన్టీఆర్‌ 25వ ప్రతిష్టాత్మక చిత్రం ‘నాన్నకు ప్రేమతో’, మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీనెంబర్‌ 150’, సూర్య నటించిన 25వ చిత్రం ‘సింగం’, మహేష్‌ నటించిన 25వ ప్రతిష్టాత్మక చిత్రం ‘మహర్షి’ చిత్రాలకు తానే సంగీతం అందించానని ఆయన ఆనందపడుతున్నాడు. ఇదే సమయంలో ఆయన తాను అందించే సంగీతం క్వాలిటీ మిస్‌ అవుతోందన్న విషయాన్ని గ్రహించడం అవసరం. లేకపోతే ఈ ముచ్చట మూడు నాళ్లుగా మిగిలే అవకాశం ఉందనే చెప్పాలి. 



By May 10, 2019 at 10:43AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45878/devi-sri-prasad.html

No comments