Breaking News

టాలీవుడ్‌లో శ్రద్ధాల హవా నడుస్తోందా!


గతంలో టాలీవుడ్‌లో శ్రద్దాదాస్‌ అనే హీరోయిన్‌ ఉండేది. కానీ ఆమెకి సినిమాలు అచ్చిరాలేదు. మన నుంచి ఆమెకి ఒక్కటంటే ఒక్కహిట్‌ కూడా లేదు. ఏదో అలా ఐటంసాంగ్‌లు, అతిథి పాత్రలు, సెకండ్‌ హీరోయిన్‌గా నటించి తెరమరుగైంది. కానీ ఈ ఏడాది మాత్రం ఇద్దరు శ్రద్దాలదేనని చెప్పాలి. మొదటి భామ శ్రద్దాశ్రీనాథ్‌. ఈమె తెలుగు వారికి కొత్తేమో గానీ కన్నడలో తెలుగులో సమంత రీమేక్‌ చేసిన ‘యూటర్న్‌’ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత తమిళంలో ‘విక్రమ్‌ వేదా’లో మాధవన్‌ భార్యగా అదరగొట్టింది. ఇప్పుడు తాజాగా దక్షిణాదిలోని అత్యంత ప్రముఖ ఇండస్ట్రీ టాలీవుడ్‌కి నాని నటించిన ‘జెర్సీ’ ద్వారా పరిచయం అయింది. జెర్సీ చిత్రం కూడా అద్భుత విజయం దిశగా సాగుతోంది. ఈమె టాలెంట్‌ గురించి ఇంతకు ముందే అందరికీ తెలుసు. దానిని ‘జెర్సీ’లో చేసి చూపించింది. పదేళ్ల పిల్లాడికి తల్లిగా, భర్తను డబ్బుకోసం ఒత్తిడి చేసే సగటు భార్యగా ఆమెనటనకు ప్రేక్షకులు జేజేలు చెబుతున్నారు. నాని కొత్తగా ప్రూవ్‌ చేసుకోవడానికి ఏమీ లేదు. ఆయన ఏనాడో తన టాలెంట్‌ని నిరూపించుకుని నేచురల్‌స్టార్‌గా నిలుస్తున్నాడు. ఈ లెక్కన ‘జెర్సీ’ చిత్రం శ్రద్దాశ్రీనాథ్‌తో పాటు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరికి బాగా కలిసొచ్చింది. 

ఇక రెండో శ్రద్ద ఎవరంటే శ్రద్దాకపూర్‌. ఈమె బాలీవుడ్‌లో ఇప్పటికే తనేమిటో పలుసార్లు నిరూపించుకుంది. ఆమె ‘బాహుబలి’ తర్వాత నేషనల్‌స్టార్‌గా మారిన ప్రభాస్‌ నటిస్తున్న తదుపరి చిత్రం ‘సాహో’లో ప్రభాస్‌కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం ఆగష్టు15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కావడానికి సిద్దమవుతోంది. రెండు వందలకోట్లకి పైగా బడ్జెట్‌తో రూపొందుతున్నఈ చిత్రంపై దేశవ్యాప్తంగా, దేశంలోని అన్ని భాషల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో ఎన్నోసార్లు ప్రూవ్‌ చేసుకున్నా కూడా ఈమెకి ఇది సౌత్‌లో మొదటి చిత్రం. యాక్షన్‌ ఓరియంటెండ్‌ చిత్రంగా రూపొందుతున్న ‘సాహో’లో శ్రద్దా క్యారెక్టర్‌, ఆమెపై చిత్రీకరించిన యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయేలెవల్‌లో ఉన్నాయని ఇటీవల విడుదలైన షేడ్స్‌ ఆఫ్‌ సాహో మేకింగ్‌ వీడియో నిరూపించింది. 

ఇప్పుడు మొదటి శ్రద్దా హిట్‌ కొట్టేసింది. ఇక రెండో శ్రద్దా కూడా హిట్‌ కొడితే ఇద్దరు శ్రద్దాలు ఈ ఏడాది తెలుగు బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన వారు అవుతారు. అంతేగాదు.. రాబోయే రోజుల్లో వీరిద్దరికీ దక్షిణాది పరిశ్రమ రెడ్‌కార్పెట్‌ పరచడం ఖాయమని చెప్పవచ్చు. మొత్తానికి ‘శ్రద్ద’ల రచ్చ ఏ స్థాయిలో సాగుతుందో వేచిచూడాల్సివుంది. 



By April 24, 2019 at 05:25AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45651/shraddha-srinath.html

No comments