Breaking News

శుభ్రంగా ‘గల్లీబోయ్‌’ రీమేక్ చేసుకోవచ్చుగా!


మార్పు మంచికే.. కానీ ఏదైనా ఒకరోజుతో ఆగిపోకూడదు. నిరంతర జీవన ప్రయాణంలో ప్రేక్షకుల అభిరుచిలో వస్తున్న మార్పులకి అనుగుణంగా ప్రతిక్షణం మనల్ని మనం మార్పు చేసుకుంటూ ఉండాలి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టాలీవుడ్‌ హీరోల తీరు కాస్తైనా మారింది. కాబట్టే ‘రంగస్థలం, భరత్‌ అనే నేను, మజిలీ, జెర్సీ’ వంటి చిత్రాలు వస్తున్నాయి. ఎంత సేపు తమ ఇమేజ్‌కి తగ్గ కథలు రావడం లేదని తిట్టుకుంటూ సాయిధరమ్‌తేజ్‌లా వరుస పరాజయాలు ఎదుర్కొనే బదులు మారితే పోయేదేముంది.. ఇమేజ్‌ ఛట్రాలు తప్ప అని మాత్రం అనుకోవడం లేదు. స్టార్‌డమ్‌లో మన హీరోలను మించిన బాలీవుడ్‌ స్టార్స్‌ మాత్రం కొత్తదనం కోసం ఉవ్విళ్లూరుతూ పక్కవారి కంటే తమ వద్దకు విభిన్న సబ్జెక్ట్‌లు రావాలని పోటీపడుతున్నారు. 

ఇందులో రణవీర్‌సింగ్‌ ఒకడు. ‘బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌, సింబా, గల్లీబోయ్‌’.. ఇలా ఒకటితో ఒకటి పొంతన లేని పాత్రలు చేస్తున్నాడు. ‘పద్మావత్‌’లో కరడుగట్టిన విలన్‌ అల్లా వుద్దీన్‌ఖిల్జీగా చేసే దమ్ము ఆయన తప్పించి ఎవరు చేయగలరు? అనిపించాడు. ఇక ‘గల్లీబోయ్‌’ది మరో ఎత్తు. సూటు, బూటు, కార్లు వేసుకుని, వందల మంది విలన్లను మట్టికరిపించినా చొక్కా, ప్యాంట్‌ ఇస్త్రీ చెడకుండా, హెయిర్‌ కూడా చెదరకుండా హీరోయిజం చూపడమే నటన అనుకుంటే ఎలా? అందుకే రణవీర్‌సింగ్‌ వంటి స్టార్‌ ‘గల్లీబోయ్‌’గా నటిస్తే దేశం మొత్తం ఫిదా అయిపోయింది. 

గల్లీలోని ముస్లిం కుటుంబం, కటిక పేదరికం, డబ్బున వారి చీత్కారాలు, తండ్రి రెండో వివాహం చేసుకుంటే ఏమీ చేయలేని నిస్సహాయత, తండ్రి చేత దెబ్బలు తినే క్యారెక్టర్‌.. ఇలాంటివి మనం ఊహించగలమా? అందుకే ఈ చిత్రానికి దేశం పట్టం కట్టింది. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిధరమ్‌తో అల్లుఅరవింద్‌ రీమేక్‌ చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ ఊసే లేదు. ఏదిఏమైనా ఇలాంటి రీమేక్‌లో నాని, వరుణ్‌తేజ్‌ వంటి వారైనా చేయడానికి ముందుకు వస్తే అలాంటి చిత్రాలను ఆస్వాదించే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు కూడా కలుగుతుంది. అంతేగానీ ఎవరికి ఎవరు ఎవరో చేస్తారులే అనుకుంటే మార్పు రాదనే చెప్పాలి. 



By April 22, 2019 at 01:34PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45633/ranveer-singh.html

No comments