Breaking News

ఈ యువ హీరోకి కూడా కోలీవుడ్‌లో ఇబ్బందులు!


మన స్టార్‌ హీరోల నుంచి యంగ్‌ హీరోల వరకు తమ మార్కెట్‌ని విస్తరించుకునే క్రమంలో కోలీవుడ్‌లో కూడా తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నుంచి సందీప్‌కిషన్‌, ఆర్యన్‌రాజేష్‌, ఉదయ్‌కిరణ్‌, అల్లరినరేష్‌, నాని వరకు పలు ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. ఇక మలయాళంలో, హిందీలో మాత్రం మన హీరోలకు బాగానే క్రేజ్‌ వస్తున్నా కూడా కోలీవుడ్‌ మాత్రం అందరి ద్రాక్షగానే మారుతోంది. ఇక తాను నటించిన పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి, గీతగోవిందం, ట్యాక్సీవాలా వంటి చిత్రాలతో యంగ్‌ సెన్సేషనల్‌ హీరో విజయ్‌దేవరకొండ దూసుకుపోతున్నాడు. తెలంగాణ మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ సంచలన హీరో తమిళనాట తన తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సాధించాడు. 

ఇక అర్జున్‌రెడ్డిని చియాన్‌ విక్రమ్‌ తనయుడి తెరంగేట్రం చిత్రంగా పలు విషయాలలో వివాదాలకు కారణమైంది. ఇక మహానటి తమిళంలో కూడా విడుదలైంది. ఈ ఊపులో అతి తక్కువ చిత్రాల కెరీర్‌లోనే విజయ్‌దేవరకొండ తెలుగు, తమిళ భాషల్లో నోటా చిత్రం చేశాడు. టైటిల్‌పరంగా సంచలనం సృష్టించి, తెలంగాణ ఎన్నికల సందర్భంగా వివాదాస్పదంగా మారిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా డిజాస్టర్‌ అయింది. అయినా మన హీరోగారు మత్రం పట్టిన పట్టు వదలడం లేదు. 

ప్రస్తుతం ఆయన మైత్రి మూవీమేకర్స్‌ బేనర్‌లో భరత్‌కమ్మ దర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం చేస్తున్నాడు. దీనిని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలతో సహా ఇటీవలే అనువాద చిత్రాలకు పచ్చజెండా ఊపిన కన్నడలో కూడా ఒకేసారి రానున్నాడు. ఇందులో రష్మిక మందన్న నటిస్తూ ఉండటం మరో ప్లస్‌ పాయింట్‌. తాజాగా ఆయన మరోసారి మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో ఆనంద్‌ అన్నామలై దర్శకునిగా ‘హీరో’ చిత్రంలో నటిస్తున్నాడని అధికారిక సమాచారం వచ్చింది. దీనిని కూడా ఒకేసారి తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్‌ చేయనున్నామని మైత్రి మూవీస్‌ సంస్థ ప్రకటించింది. టైటిల్‌గా ‘హీరో’ని ఫిక్స్‌ చేసింది. అయితే ఈ విషయంలో నిర్మాతలు కాస్త ముందు చూపుతో వ్యవహరించలేదని తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. 

శివకార్తికేయన్‌ హీరోగా విశాల్‌ అభిమన్యుడు ఫేమ్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ కన్‌ఫర్మ్‌ అయింది. ఈ విషయాన్ని తమిళ నిర్మాతల సంఘం అధికారకంగా ప్రకటించింది. ఈ టైటిల్‌ని ఎనౌన్స్‌ చేసేముందు మైత్రి మూవీ మేకర్స్‌ ఈ విషయాన్ని ముందుగా రిజిష్టర్‌ చేయించకుండా తప్పు చేసింది. అలాగని ‘హీరో’ టైటిల్‌ ముందు ఏదైనా తోకని తగిలించాలన్నా, ఇటువంటి విషయాలలో టిఎఎఫ్‌సి కఠినంగా ఉంటుంది. తమ వారికి కాకుండా బయటి వారికి ఈ టైటిల్‌ని వారు అంగీకరించకపోవచ్చు. ఇలా విజయ్‌కి రెండో తమిళ చిత్రంతోనే ఆదిలోనే పెద్దషాక్‌ తగిలిందనే చెప్పాలి. 



By March 16, 2019 at 02:08PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45161/vijay-deverakonda.html

No comments