‘ఎన్టీఆర్ బయోపిక్’ ఎఫెక్ట్: మళ్లీ మొదటి నుంచి క్రిష్!
తెలుగులో అభిరుచి కలిగిన దర్శకుల్లో క్రిష్ పేరును కూడా చెప్పుకోవాలి. శేఖర్‌కమ్ముల తరహాలో ఈయన చిత్రాలంటే ఇష్టపడే ఓ వర్గం ప్రేక్షకులు ఉంటారు. గమ్యంతో ఈయన సినీ ప్రస్థానం మొదలుపెట్టి భారీ విజయం కూడా సాధించాడు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె వంటి చిత్రాలతో తన సత్తా చాటాడు. మధ్యలో తెలుగు ఠాగూర్, తమిళ రమణలకు రీమేక్‌గా బాలీవుడ్‌లో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రం తీశాడు. ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు. అయితే ఆయనకు పెద్ద కమర్షియల్ బ్రేక్‌నిచ్చిన చిత్రం మాత్రం నందమూరి బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. లిమిటెడ్ బడ్జెట్‌లో, అనుకున్న సమయానికి, అతి తక్కువ కాలం షూటింగ్‌తో ఈయన ఈ చారిత్రాత్మక చిత్రం చేసిన తీరు, అది మంచి లాభాలను సాధించడం ఆయన కెరీర్‌ని మలుపు తిప్పాయని అందరు భావించారు.
కానీ ఆ తర్వాతే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. బాలీవుడ్ క్వీన్ కంగనారౌనత్ ఏరికోరి తాను చేయనున్న ‘మణికర్ణిక’ బాధ్యతలను క్రిష్ చేతికి అందించడంతో అంచనాలు బాగా పెరిగాయి మరోవైపు తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌గా బాలయ్య నటించిన ‘కథానాయకుడు, మహానాయకుడు’లలో ఈయనకు చాన్స్ వచ్చింది. దర్శకుడు తేజ స్థానంలో ఈయన ఎంటర్ కావడంతో ఈ బయోపిక్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి బాలయ్య జోక్యం వల్లనో, లేక మరేదైనా కారణం కావచ్చుగానీ ఈ రెండు పార్ట్‌లు ఫ్లాప్ అయ్యాయి.
‘మణికర్ణిక’ నుంచి ఈయన మధ్యలోనే తప్పుకోవడంతో ఆ క్రెడిట్ కంగనారౌనత్‌కి దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం క్రిష్ ఓ బాలీవుడ్ చిత్రం చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడట. ఈ బాలీవుడ్ భారీ ప్రాజెక్ట్ త్వరలో సెట్ కానుందని సమాచారం. ఈ బాలీవుడ్ మూవీ తర్వాత ఆయన అల్లుఅర్జున్ హీరోగా ఓ చిత్రం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక నిర్మాతగా కూడా క్రిష్‌కి ‘అంతరిక్షం’ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. మరి ఆయన చేయబోయే తదుపరి చిత్రాలైన బాలీవుడ్ మూవీ, అల్లుఅర్జున్‌ల చిత్రాలపైనే క్రిష్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.
By March 29, 2019 at 01:19PM
No comments