వైఎస్ జగన్ చేతినిండా దొరికేశాడు..!
ఏపీలో ఎన్నికల వేడితో పాటు బిజెపి, టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర చర్చ సాగుతోంది. హోదా ఇస్తామని, ఆతర్వాత ప్యాకేజీ ఇస్తామని మాటలు చెప్పిన బిజెపిపై వర్గ, ప్రాంత, మత, కులాలలకు అతీతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇది కేవలం టిడిపి సానుభూతి పరుల్లోనే అనుకంటే పొరపాటు. చంద్రబాబుని వ్యతిరేకించే వారు కూడా బిజెపిపై మండిపడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కూడా ఎంతో కాలం బిజెపితో కాపురం చేసిన మాట వాస్తవమే అయిన చంద్రబాబునే కాదు.. ఏపీ ప్రజలను కూడా బిజెపి తీవ్రంగా మోసం చేసిందనే ఆలోచన ఆంధ్రుల్లో బాగా ఉంది. చంద్రబాబుపై కోపం ఉంటే అది చంద్రబాబుపైనే చూపించాలి గానీ రాష్ట్ర ప్రజలపై, రాష్ట్రంపై మోదీ-అమిత్‌షాలు చూపించడం ఏమిటి? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
మరోవైపు చంద్రబాబు, ఈమధ్య పవన్‌లు కూడా మోదీపై, కేసీఆర్‌పై ఒంటికాలితో లేస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఏపీని మోసం చేసిన మోదీని గానీ బిజెపిని గానీ పల్లెత్తు మాట అనడం లేదు. దీంతో జగన్, మోదీల మధ్య రహస్య అవగాహన ఉందనే విషయం స్పష్టమవుతోంది. అది తాజాగా కేంద్రమంత్రి పీయూష్ ఘోయల్ మాటలతో నిజమని బయటపడింది. మరోవైపు తెలంగాణను సమైక్యాంద్ర కాలంలో ఆంధ్రానాయకులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు మోసం చేశారేగానీ సామన్యమైన ఆంధ్రుడు తెలిసి తెలిసి తెలంగాణకు చేసిన మోసం ఏమి లేదు. అసలు కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆంధ్ర పట్ల తీవ్ర వ్యతిరేకత రావడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ధోరణి, హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ తిష్ట వేసి కబ్జాల నుంచి పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం కూడా ఒక ముఖ్యాంశం.
కానీ కేసీఆర్ మాత్రం సామాన్యమైన ఆంధ్రులను కూడా నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు. పోనీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయినా ఆయన ఆ మాటలు ఆపాడా? అంటే అది కూడా లేదు. కిందటి ఎన్నికల్లో కూడా మరలా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి ఆంధ్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలాంటి కేసీఆర్‌తో జగన్ కలవడం ఆయన చేసుకుంటున్న సెల్ఫ్‌గోల్ అనే చెప్పాలి. అసలు ఆంధ్రాకి ప్రత్యేకహోదా విషయంలో మొదట్లో సుముఖంగానే ఉన్నామని చెప్పిన టిఆర్‌ఎస్ ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రానికి కూడా ఇవ్వాలని తిరకాసు పెట్టింది. ఇక పోలవరం ఆపడానికి కేసీఆర్, టిఆర్‌ఎస్‌లు కంకణం కట్టుకున్నాయి. ఇలాంటి కేసీఆర్ తనకి మద్దతు ఇస్తే చంద్రబాబుకి అంత కడుపమంట దేనికి అని చెప్పడం ద్వారా వైసీపీ-టిఆర్‌ఎస్‌ల స్నేహం బట్టబయలైంది. ఇది రాబోయే రోజుల్లో జగన్ చేసుకున్న సెల్ఫ్‌గోల్‌గా మారుతుంది అనడంలో సందేహమే లేదు.
By March 27, 2019 at 11:54AM
No comments