Breaking News

ఈమె స్ఫూర్తితోనైనా యువతరం మారుతుందా?


మన నాయకులే కాదు.. ప్రజలు కూడా అంతే తంతు. యధా రాజా తథా ప్రజా అనేది అందుకే. కులం అడిగిన వాడిని చెప్పుతో కొట్టండి. కులం పిచ్చి ఉన్నవాడు గాడిదతో సమానం వంటివి చెప్పే ఓ చానెల్‌ కూడా కులాల మీద, కుల నాయకులతో ఇంటర్వ్యూలు, చర్చావేదికలు నిర్వహిస్తూ ఉంటుంది. ఫలానా సామాజిక వర్గానికి ఫలానా చోట బలం ఉందని విశ్లేషణలు అందిస్తుంది. ఇక రాజకీయ నాయకులు, ప్రజల సంగతి చెప్పాల్సిన పనిలేదు. నిజానికి పేదలు, నిరక్షరాస్యులు కంటే బాగా చదువుకున్న వారిలోనే కుల పిచ్చి అధికంగా ఉందనేది వాస్తవం. దానికి మంచి తెలివితేటలు, చదువు ఉండి సోషల్‌మీడియాను వాడుకుంటున్న వారిలో ఉన్న కుల గజ్జే దీనికి నిదర్శనం. 

ముందుగా ప్రభుత్వాలు తమ పథకాలు, ఇతర సర్వేలలో మతం, కులం అనే కాలమ్‌లను తీసివేయాలి. ఇంటి పేరును కాకుండా తమిళనాడు, ఉత్తర భారతదేశంలోలాగా తల్లి లేదా తండ్రి పేరు ప్రతి వ్యక్తికి ఇంటిపేరుగా మార్చే విధానాన్ని చేపట్టాలి. కుల సంఘాలను, కులాల పేరుతో కార్పొరేషన్లు, ఇతర రిజర్వేషన్‌ సౌకర్యాలు వంటివాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. ఒకనాడు పురుషుల పేర్ల వెనుక మాత్రమే కులాల తోకలు కనిపించేవి. అవి నేడు మహిళల పేర్ల పక్కన కూడా చేరుతున్నాయి. 

ఇక విషయానికి వస్తే మన దేశంలో కులం, మతం లేని తొలి మహిళగా తాజాగా ఓ యువతి నిలిచింది. తమిళనాడుకి చెందిన స్నేహ పార్తీబరాజా దేశంలోనే మతం, కులం లేని మొట్టమొదటి వ్యక్తి అయింది. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఈమె తన బాల్యం నుంచి స్కూల్స్‌, కాలేజీలలో కూడా కులం, మతం అనే కాలమ్స్‌ని పూర్తి చేసేది కాదు. తాజాగా చదువు ముగించుకుని న్యాయవాద వృత్తిని స్వీకరించింది. ఈమెకి ఇప్పటి దాకా కులం, మతం లేని విధంగా ప్రభుత్వం నుంచి అధికార దృవీకరణ పత్రం లభించలేదు. 

కానీ ఎట్టకేలకు ఈమెకి కులం, మతం లేకుండా ప్రభుత్వ గుర్తింపు పత్రం లభించడంతో దేశంలోనే కులం, మతం లేని తొలి వ్యక్తిగా ఈమె రికార్డును సాధించింది. ఈ విషయం తెలుసుకున్న కమల్‌హాసన్‌ నుంచి ఎందరో ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజానికి ఈమె స్ఫూర్తితోనైనా యువతరంలో మార్పు వస్తే అదే పదివేలని చెప్పాలి. 



By February 20, 2019 at 10:14AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44797/sneha-parthibaraja.html

No comments