Breaking News

‘బాహుబలి’నే ఫాలో అవుతోన్న ‘సై..రా’!


భారీ బడ్జెట్‌ చిత్రాలు, ముఖ్యంగా చారిత్రక సినిమాలు వంటి వాటి చిత్రీకరణ బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. ‘బాహుబలి-ది బిగినింగ్‌, బాహుబలి-ది కన్‌క్లూజన్‌’లకు కలిపి విడుదలయ్యే సమయానికి ఏకంగా ఐదేళ్లు పట్టింది. ఇక ‘2.ఓ’ది కూడా అదే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ‘బాహుబలి’ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సై..రా..నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌ బేనర్‌లో దాదాపు ఒకే పార్ట్‌గా వస్తున్న ఈ మూవీకి 250కోట్లకు పైగా బడ్జెట్‌ని కేటాయిస్తూ, రాజీ అనే పదానికి తావు లేకుండా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో విడుదల చేసే అవకాశం లేదు గానీ దక్షిణాదిలోని అన్ని భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాత చరణ్‌ ప్రకటించాడు. తొలి తెలుగు స్వాతంత్య్రయోధుడు, రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రాన్ని కిందటి ఏడాదే విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి.

ఇటీవల రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేస్తామని, వేసవికి షూటింగ్‌ పూర్తి అవుతుందని చెప్పుకొచ్చాడు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ దసరాకి విడుదల కాకపోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది అంటే 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. చిరంజీవి దాదాపు దశాబ్దం తర్వాత తన 150వ చిత్రంగా రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీనెంబర్‌ 150’ చిత్రం 2017 సంక్రాంతికి విడుదలైంది. 

2020 సంక్రాంతికి ‘సై..రా’ విడుదలైతే ఈ రెండు చిత్రాలకు దాదాపు మూడేళ్ల గ్యాప్‌ వచ్చినట్లు అవుతుంది. ఈ వార్తలు వచ్చిన తర్వాత చిరు అభిమానులు, మెగాభిమానులు నిరుత్సాహానికి లోనవుతున్నారు. అయినా ఏదో ఎన్టీఆర్‌ బయోపిక్‌లాగా స్పీడుగా చుట్టేయకుండా క్వాలిటీ కోసం సమయం వెచ్చించడం ఒక విధంగా మంచిదేనని చెప్పుకోవాలి. కానీ మరీ మూడేళ్ల గ్యాప్‌ రావడం మాత్రం కాస్త అసంతృప్తిని కలిగించే విషయమేనని చెప్పాలి. 



By February 05, 2019 at 11:57AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44581/chiranjeevi.html

No comments