Breaking News

పవన్‌ నిర్ణయం మేలు చేస్తుందా..?


జనసేనాని పవన్‌కళ్యాణ్‌ 2014కి ముందే రాజకీయాలలోకి ప్రవేశించి, చాలా కాలం రాజకీయాలు, సినిమాలు అనే జోడెద్దుల సవారీ చేశాడు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉన్నా కూడా పలువురు నిర్మాతలకు కమిట్‌మెంట్స్‌ ఇచ్చాడు. అందులో భాగంగానే ఆయన మైత్రి మూవీ మేకర్స్‌, ఎ.యం.రత్నం వంటి వారి సినిమాలకి ఒప్పుకున్నాడు. రత్నం-నీసన్‌ల చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఇది ‘బంగారం’ చిత్రం వచ్చిన సమయంలో ఎ.యం.రత్నంకి ఇచ్చిన మాట. అంతలోనే ఆయన సడన్‌గా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అజ్ఞాతవాసి’లోకి వెళ్లిపోయాడు. ఆయన మైత్రి మూవీమేకర్స్‌కి, రత్నంకి ఇచ్చిన కమిట్‌మెంట్స్‌ మాత్రం అలాగే పెండింగ్‌లో ఉండి పోయాయి. వారికి తిరిగి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చాడని కొందరు, ఇవ్వలేదని కొందరు అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వకుండా తాను కమిట్‌ అయిన నిర్మాతలకు తన బదులుగా తాను ఎంతో ప్రేమించే మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ ని లైన్‌లోకి తెచ్చాడట. 

తనతో చిత్రాలు తీయాలనుకున్న వారికి తన ప్రత్యామ్నాయంగా సాయిధరమ్‌తేజ్‌తో సినిమాలు చేయమని చెప్పి వారిని ఒప్పించాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మైత్రి మూవీమేకర్స్‌ బేనర్‌లో కిషోర్‌తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ చిత్రం నిర్మాణం అవ్వనుంది. మరోవైపు నిర్మాత ఎ.యం.రత్నం ‘ఆక్సిజన్‌’పై ఎన్నోఆశలు పెట్టుకుని అజిత్‌ పుణ్యాన సంపాదించినదంతా ఆ చిత్రంతో పోగొట్టుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం సాయిధరమ్‌తేజ్‌, రత్నంకి ఓ చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. 

అయినా వరుస ఫ్లాప్‌లలో ఉన్న సాయిని తన నిర్మాతలకు అప్పగించడం దారుణమని, దీనివల్ల లాభాలు కాదు కదా...! కనీసం సాయి సినిమాల బిజినెస్‌ కూడా జరిగే పరిస్థితులు లేని తరుణంలో ఇలా చేయడం సబబేనా పవన్‌...! అదేదో తన అబ్బాయ్‌ రామ్‌చరణ్‌ని తన నిర్మాతలకిచ్చినా ఫర్వాలేదు గానీ ఇలా పోయిపోయి సాయిని తనకు ప్రత్యామ్నాయంగా ఇవ్వడం ఎంత వరకు సమంజసం...? రామ్‌చరణ్‌ అయితే ఇప్పుడు బాబాయ్‌ పవన్‌కళ్యాణ్‌లానే ఫ్లాప్‌ చిత్రాల ద్వారా కూడా 50కోట్లకు పైగా ఓపెనింగ్స్‌ సాధించే స్థితిలో ఉన్నాడు. మరి పవన్‌ నిర్ణయం ఆయా నిర్మాతలకు మేలు చేస్తుందా? లేక కీడు చేస్తుందా? అనేది కాలమే తేల్చాలి. 



By February 07, 2019 at 05:03PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44612/pawan-kalyan.html

No comments