బి. సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ బిరుదు
*మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో వేడుక
సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి. సరోజాదేవికి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ‘విశ్వనటసామ్రాజ్ఞి’ బిరుదుతో సత్కారం. ప్రముఖ నిర్మాత, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్త, కళాబంధు, డా. టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో వైభవంగా జరిగే వేడుకలో ఈ బిరుదుతో సత్కరించనున్నట్లు తెలిపారు. సుబ్బరామిరెడ్డి మహాశివభక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని ఆయన వైజాగ్‌లో జరుపుకుంటూ వస్తున్నారు. పాతికేళ్ళుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. టీఎస్సార్ నిర్వహించే మహాశివరాత్రి లింగార్చనకు దేశవిదేశాలవాసులు సైతం హాజరవుతూ ఉంటారు. విశాఖ రామకృష్ణా బీచ్‌లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో సాగుతుంది. ఈ సందర్భంగా ప్రతి మహాశివరాత్రి నాడు కళాకారులను సన్మానించడం విధిగా నిర్వర్తిస్తున్నారాయన. ఈ యేడాది మహాశివరాత్రి నాడు మహానటి పద్మభూషణ్ బి.సరోజాదేవికి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ బిరుదుతో సుబ్బరామిరెడ్డి ఆమెను సత్కరించనున్నారు. టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగే బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, మధురగాయని పి. సుశీల వీరితో పాటు పలువురు సినీరాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. సాలూరి వాసూరావు సంగీతవిభావరి నిర్వహించనున్నారు.
బి. సరోజాదేవి కన్నడ నాట జన్మించినా, తెలుగువారికి సుపరిచితులు. మహానటుడు యన్టీఆర్ తమ ‘పాండురంగ మహత్యం’ ద్వారా బి. సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం చేశారు. ఆ తరువాత యన్టీఆర్ సరసన ‘సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దాగుడుమూతలు, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, మాయని మమత, భాగ్యచక్రము, ఉమాచండీ గౌరీశంకరుల కథ, విజయం మనదే, మనుషుల్లో దేవుడు, దానవీరశూరకర్ణ’ వంటి చిత్రాల్లో నటించారు.
మరో మహానటుడు అక్కినేని సరసన కూడా బి.సరోజాదేవి నటించి అలరించారు. ఆయనతో ‘పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, వసంతసేన, రహస్యం’ వంటి చిత్రాల్లో నటించారు.
తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి అపూర్వమైన విజయాలను సాధించారు. బి.సరోజాదేవి అభినయవైభవానికి ఎన్నెన్నో అవార్డులు రివార్డులు లభించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం సరోజాదేవి అందుకున్నారు.
By February 24, 2019 at 04:58AM
No comments