రజనీ ముందు చూపు.. విమర్శల జోరు!
రజనీకాంత్‌ది ప్రతి విషయంలోనూ నాన్చేధోరణి. కానీ ఇది రాజకీయాలలో పనికిరాదు. ప్రత్యర్ధి ఎత్తులు వేసే లోపల పైఎత్తులు వేయగలగాలి. తనకంటూ కొన్ని సిద్దాంతాలు, అభిప్రాయాలు ఉండాలి. వాటిని అమలు చేస్తూ ముందుకు దూసుకుని వెళ్లాలి. కానీ రజనీ ఆ పని చేయలేకపోతున్నాడు. ఆయన సీనియర్ స్టారే గానీ సిన్సియర్ పొలిటీషియన్ కాదు. రాజకీయాలలోకి వస్తాను అంటూనే ‘కబాలి, కాలా, పేట’ అంటూ ఉంటాడు.
తాజాగా ఆయన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే నా టార్గెట్ అని చెప్పాడు. ఇక ఈయనకు జాతీయ రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి లేదు. ఎంజీఆర్, ఎన్టీఆర్‌లా సీఎం కావాలనేది ఆయన కోరిక. అయితే ఈయన ముందుగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి పెద్దగా ప్రభావం చూపకపోతే అది అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది. పరువు పోతుంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే విషయంలో కూడా వేచిచూసి, ఫలితాలు వెలువడిన తర్వాత తన రాజకీయ స్ట్రాటర్జీని తయారు చేయాలని ఆయన భావిస్తున్నారు.
మరోవైపు రజనీ నిర్ణయంపై తమిళ ఓటర్లే కాదు.. అభిమానులు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాలలో బిజెపికి ఇన్‌డైరెక్ట్‌గా మద్దతు ఇచ్చి, బిజెపి ఓట్లు చీలకుండా ఉండేందుకే రజనీ ఈ నిర్ణయం తీసుకున్నాడనేది ప్రధాన విమర్శగా మారింది. ఇక సినిమాలలో రజనీకి ప్రత్యర్థి, నిజజీవితంలో మంచి స్నేహితుడైన కమల్‌హాసన్ రజనీ నిర్ణయంపై మండిపడుతున్నాడు. ఆయన రజనీపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రజనీ ఓ పిరికి వాడు. ఒంటికి ఆయిల్ పూసుకుని, తొడగొట్టిన తర్వాత ఖచ్చితంగా బరిలోకి దిగాలి. గెలుపో.. ఓటమో తేల్చుకోవాలి.
కానీ నాకు ఇప్పుడు మూడ్ లేదు.. రేపొస్తా.. భవిష్యత్తులో వచ్చి అంతు చూస్తా అంటే వీలు కాదు. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పడం చేతకాని తనమే అవుతుంది అని మండిపడ్డాడు. రజనీ ఇప్పుడే కాదు.. ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతాడు. కానీ నేను మాత్రం తాడో పేడో తేల్చుకోవడానికే రాజకీయాలలోకి వచ్చాను.. అంటూ కమల్ రజనీపై చేసిన విమర్శలలో కూడా నిజం ఉందనే చెప్పాలి.
By February 20, 2019 at 10:22AM
No comments