Breaking News

అందుకే దేశం గర్వించదగ్గ నటుడయ్యాడు


నటులు ఎందరో ఉంటారు గానీ సంపూర్ణనటులు అనిపించుకునే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. నిజానికి నటనలో ఆహార్యం, హావభావాల పాత్ర ఎంత ఉంటుందో దానికి మించిన ముఖ్యమైన పాత్రను వాచకం పోషిస్తుంది. గతంలో మన సినిమాలలో అందునా మన హీరోలందరు స్వచ్చంగా తెలుగును సొంతంగా, అద్భుతమైన వాక్పటమిను కలిగిన వారే. నిజానికి నటనలో వాచకం అనేది కీలకపాత్ర అయినప్పుడు అరువు గొంతులపై ఆధారపడిన వారికి నంది అవార్డులు ఎలా ఇస్తారు? అని సుమన్‌కి ‘బావా-బావమరిది’ చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చినప్పుడు కొందరు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ రంగంలోనే ఉంటున్న ఎందరో సీనియర్‌ హీరోలైన సుమన్‌, రాజశేఖర్‌ నుంచి పరభాషా నటుల వరకు అందరు డబ్బింగ్‌ మీద ఆధారపడుతున్న వారే. అందుకే కోట శ్రీనివాసరావు ఓ సారి తన ఆవేదనను తెలియజేస్తూ, పరభాషా నటులు నటించడంలో తప్పేమి లేదు. ఆ లెక్కకి వస్తే నేను కూడా పరభాషా చిత్రాలలో నటించాను. 

కానీ అమితాబ్‌, నానాపాటేకర్‌ వంటి గొప్పనటులు తెలుగులో నటిస్తే అందులో నాకు చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాను. అంతేగానీ గంభీరమైన శరీరంతో నటన తెలియని, అరువు గొంతులపై ఆధారపడే వారిని నేను పట్టంచుకోను. ఓ నటుడు ఏదైనా భాషలో నటిస్తున్నాడంటే దానికి విలువ ఇచ్చి కనీసం తన వంతు కష్టపడి నటించాలి. అంతేగానీ ఒక్కొక్కటి ఒక్కొక్కరు చేస్తూ ఉంటే తెరపై కనిపించే వారు ఉన్నా కూడా వృధానే అని తెలిపాడు. నేడు పలువురు మలయాళ భామలు, రాశిఖన్నా, సమంత వంటి వారు డబ్బింగే కాదు.. పాటలు కూడా పాడుతున్నారు. ఆమాత్రం ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న మనవారు చేయకపోవడం దౌర్భాగ్యమనే చెప్పాలి. 

ఇక విషయానికి వస్తే దేశం గర్వించదగ్గ నటుల్లో మమ్ముట్టి ముందు వరుసలో ఉంటాడు. ఆయన ఓ ముస్లిం అయినా కూడా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ సంగీత పండితునిగా ‘స్వాతికిరణం’ చిత్రంలో ప్రధనపాత్రను ఇచ్చి కష్టమైన శ్లోకాలు, సంస్కృత, క్లిష్టమైన డైలాగ్స్‌ చెప్పే పాత్రకావడంతో విశ్వనాథ్‌ వద్దులే అని వారించినా కూడా తానే స్వయంగా కష్టపడి సొంతగా డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. ఇదే సూత్రాన్ని మరోసారి మమ్ముట్టి ఈతరం ప్రేక్షకులకు రుజువు చేయనున్నాడు. 

ప్రస్తుతం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇందులో అచ్చు రాజశేఖర్‌రెడ్డిలా కనిపించడం కోసం ఆయన వీడియోలు, న్యూస్‌ క్లిప్పింగ్స్‌ వంటివి కూడా చూసి వైఎస్‌ని మరిపించేలా నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి కూడా రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే తన డబ్బింగ్‌ను తానే చెప్పుకున్నాడు మమ్ముట్టి. అందుకే ఆయన సంపూర్ణనటుడు. 



By January 21, 2019 at 02:53PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44366/mammootty.html

No comments