ఇక్కడ దేవిశ్రీ.. అక్కడ రెహ్మాన్!
ఎంతటి ఉద్దండులకైనా అప్పుడప్పుడు గడ్డు పరిస్థితులు వస్తూ ఉంటాయి. సక్సెస్‌లు లేనప్పుడు నమ్ముకున్న వారు కూడా పక్కనపెడతారు. ఎందుకంటే సినిమా అనేది ఓ వ్యాపారం. ఇక విషయానికి వస్తే తెలుగులో ఇప్పటికే దేవిశ్రీని త్రివిక్రమ్ పక్కనపెట్టాడు. ఇటీవల పేలమమైన సంగీతం అందిస్తున్న దేవిశ్రీని మరికొందరు ఆస్థాన దర్శకులు కూడా పక్కనపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకంగా ఇళయరాజా, ఏఆర్‌రెహ్మాన్‌లకే ఈ పరిస్థితి ఏర్పడుతుంటే దేవిశ్రీది లెక్కలోకి రాదనే చెప్పాలి.
ఇక నాడు వరుసగా ఇళయరాజా లేనిదే చిత్రాలు తీయని మణిరత్నం ఇళయరాజా ఫేడవుట్ అవుతున్న సమయంలో రెహ్మాన్‌ని తెరపైకి తెచ్చాడు. అక్కడి నుంచి రెహ్మాన్ ఓ చిత్రం ఒప్పుకున్నాడంటే ఆ సినిమా రేంజే మారిపోయేది. మణిరత్నం తర్వాత శంకర్ రెహ్మాన్‌ని ఆస్థాన సంగీత విద్వాంసుడిని చేసుకున్నాడు. ఏదో రెహ్మాన్ బిజీగా ఉన్నప్పుడు ‘అపరిచితుడు, స్నేహితుడు’ వంటి చిత్రాలకు హరీష్ జైరాజ్‌ని తీసుకున్నాడు. కానీ ఇటీవల శంకర్ తీసిన ‘2.ఓ’ చిత్రానికి కూడా రెహ్మాన్ ఏమీ గొప్ప సంగీతం అందించలేదు. గత కొంతకాలంగా రెహ్మాన్ సంగీతం అందించిన చిత్రాలు పెద్దగా మ్యూజికల్ హిట్స్‌గా నిలబడలేకపోతున్నాయి. దాంతో శంకర్ కూడా కొత్తవాడిని చూసుకున్నాడు.
ఆయన కమల్‌హాసన్ హీరోగా అవినీతిపై సంధిస్తున్న పాశుపతాస్త్రం ‘ఇండియన్ 2’లో రెహ్మాన్‌ని పక్కనపెట్టి ‘అజ్ఞాతవాసి’ ఫేమ్ అనిరుద్‌ని తీసుకున్నాడు. అనిరుధ్‌కి తెలుగులో ఘోరపరాజయం వచ్చినా కోలీవుడ్‌లో మాత్రం ఈ యంగ్ మ్యూజీషియనే నెంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. ఇక దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తే ఖచ్చితంగా ‘భారతీయుడు’తో పోలిక వస్తుంది. మరి ఈ నేపధ్యంలో తనపై భారీగా పెరిగిన బాధ్యతను అనిరుధ్ ఎంత వరకు నెరవేరుస్తాడో వేచిచూడాల్సివుంది...!
By January 19, 2019 at 05:08AM
No comments