ఏప్రిల్ 12న అంటూ డేట్ ప్రకటించారు
మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి టాప్ యంగ్‌స్టార్స్‌తో తీసిన ‘శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం’ చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గొప్పతనాన్ని కేవలం మూడే మూడు చిత్రాలతో కొండనెక్కించాయి. సరైన కథ, దర్శకులు, హీరోలను ఎంచుకుంటూ తాము తీసిన ముగ్గురు స్టార్స్ చిత్రాలతో వీరు విజయఢంకా మోగించారు. కానీ మైత్రి మూవీమేకర్స్ సంస్థకు టాప్‌స్టార్స్ అచ్చివచ్చినట్లుగా మిగిలిన వారు కలిసి రాలేదు. రవితేజతో శ్రీనువైట్ల దర్శకత్వంలో సాహసం చేసి తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోని’, ఎంతో వైవిధ్యభరిత చిత్రంగా అందరు భావించిన నాగచైతన్య, మాధవన్, భూమిక నటించిన ‘సవ్యసాచి’ చిత్రాలు గానీ సరిగా ఆడలేదు. దాంతో వారు తాము కాస్త స్థాయి తక్కువ ఉన్న హీరోలు, దర్శకులతో కూడా సూపర్‌హిట్స్ తీయగలమనే అంశాన్ని నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
అందునా వరుస ఫ్లాప్‌ల మీద ఉన్న మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో చేస్తోన్న చిత్రం.. దర్శకుడు కూడా ‘నేను..శైలజ’ తర్వాత వెంకీతో పాటు పలువురి కథలు చెప్పి, మరలా రామ్‌తో ‘ఉన్నది ఒకటే జిందగీ’ తీసి దెబ్బతిన్న కిషోర్ తిరుమల. మరోవైపు వరుస ఆల్బమ్స్‌తో నిరుత్సాహపరుస్తున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇలాంటి వారందరి చేతిలో రూపొందుతున్న చిత్రమే ‘చిత్రలహరి’. తెలుగులో దూరదర్శన్ తొలి తరం వీక్షకులకు బాగా గుర్తుండిపోయే టైటిల్ ఇది. నాడు ప్రతి శుక్రవారం నాలుగైదు పాటలతో తెలుగు వారినంతా టివీలకుకట్టి పడేసిన ప్రోగ్రాం.
ఇక ‘చిత్రలహరి’ అంటే ఇందులో చిత్ర, లహరి అనే ఇద్దరు ప్రేయసుల మధ్య తేజుకి జరిగే ముక్కోణపు ప్రేమకథగా అర్ధమవుతోంది. ఇద్దరు హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శిని, నివేద పేతురాజ్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ లోగోలోకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విడుదలైంది. టైటిల్ డిజైనింగ్ చాలా బాగుంది. మరి టైటిల్‌లో చూపించిన వైవిధ్యం సినిమాలో కూడా ఉంటుందేమో చూడాలి.. ఇక ఈ మూవీని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు రిలీజ్‌డేట్‌ని కూడా పోస్టర్ ద్వారా కన్ఫాం చేశారు. మరి ఈ టీం అంతటికి ఈ మూవీ సక్సెస్‌ని అందిస్తుందా? లేదా? అనేది ఏప్రిల్12 వరకు వెయిట్ చేస్తేగానీ తెలియదు.
By January 19, 2019 at 05:34AM
No comments