చిక్కుల్లో మరో తమిళ్ సినిమా!
ఇటీవల విజయ్ హీరోగా నటించిన `సర్కార్` చిత్రం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఫస్ట్‌లుక్ దగ్గరి నుంచే వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా రిలీజ్ తరువాత తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సినిమాలోని వరలక్ష్మికి సంబంధించిన కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికార పార్టీ దర్శకుడు మురుగదాస్ అరెస్టుకు పూనుకోవడం తమిళ నాట చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా వివాదం సద్దుమనగక ముందే మరో తమిళ సినిమా వివాదంలో చిక్కుకుంది. అయితే ఈ సారి హీరో సినిమా కాకుండా హీరోయిన్ సినిమా వివాదం కావడం విశేషం.
హన్సిక కీలక పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం `మహా`. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం ఇటీవలే విడుదల చేసింది. అందులో స్వామీజీ వేషధారణలో వున్న హన్సిక హుక్కా పీలుస్తూ కనిపించింది. ఇదే సినిమా వివాదం కావడానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీనిపై ఆగ్రహించిన చెన్నైకి చెందిన పీఎంకే సభ్యుడు జానకి రామన్ చిత్ర దర్శకుడు యు.ఆర్. జమీల్, హీరోయిన్ హన్సికపై కేసు వేశాడు. హన్సిక స్వామీజీ వేషధారణలో హుక్కా పీల్చడం ఓ వర్గం మత విశ్వాసాలను దెబ్బతీసేలా వుందని ఆరోపిస్తూ చిత్ర బృందంపై ఆయన కేసు వేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదంపై చిత్ర దర్శకుడు యు.ఆర్. జమీల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. `ఓ దర్శకుడిగా పోస్టర్ ప్రత్యేకంగా వుండాలని ప్రయత్నించాను. ఓ వర్గాన్ని కావాలని కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. నేనే మానవత్వాన్ని నమ్ముతాను. దయచేసి ఈ విషయంలో కులమతాలను తీసుకురావొద్దు` అని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. ఈ పోస్ట్‌ను హన్సిక రీట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
By December 18, 2018 at 08:13AM
No comments