Breaking News

‘సాహో’ వచ్చే వరకు బన్నీ నిర్ణయం తీసుకోడా!


ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్తతరం, నవతరం దర్శకుల హవా బాగా కొనసాగుతోంది. పలువురు వర్ధమాన దర్శకులతో పాటు, కేవలం షార్ట్‌ఫిల్మ్‌, కొద్ది పాటి అనుభవం ఉన్న వారు కూడా డైరెక్టర్స్‌గా తమదైన ముద్ర చూపిస్తూ, హవా చాటుతున్నారు. అయినా స్టార్‌ హీరోలు మాత్రం ఆల్‌ రెడీ మంచి పేరున్న వారినే దర్శకులుగా ఎంచుకుంటున్నారు. రిస్క్‌ చేసి కొత్తవారికి ఇవ్వడానికి కాస్త ముందు వెనుక ఆలోచిస్తున్నారు. దాంతో కొత్త దర్శకులతో స్టార్స్‌ చిత్రాలు అరుదుగా మాత్రమే వస్తున్నాయి. 

ఇక విషయానికి వస్తే స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఇద్దరు కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు. సుకుమార్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆయన నటించిన ‘ఆర్య’ చిత్రం ఘనవిజయం సాధించి, ఆయనకు స్టార్‌ హోదాని, మొదటి బ్లాక్‌బస్టర్‌ని అందించింది. ఆ తర్వాత ఎంతో కాలానికి స్టార్‌ రైటర్‌ అయిన వక్కంతం వంశీని నమ్మి ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం చేశాడు. 

అసలు మొదటి నుంచి వక్కంతం వంశీ ఆయనకు మంచి సన్నిహితుడైన జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో కాస్త అనుమానం వల్ల ఎన్టీఆర్‌ వక్కంతంని పక్కనపెట్టాడు. అదేసమయంలో బన్నీ నేనున్నానంటూ అవకాశం ఇచ్చాడు. కానీ ఈ చిత్రం బన్నీకి డిజాస్టర్‌నే మిగిల్చింది. దీంతో ఎంతో గ్యాప్‌ తీసుకున్నా కూడా ఆయన ఇంకా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. అన్నీ కుదిరితే కొత్త సంవత్సరం మొదటి రోజైన జనవరి 1న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. 

ఇక తాజాగా బన్నీ మరో దర్శకుడిని కూడా లైన్‌లో పెట్టాడట. కేవలం ‘రన్‌ రాజా రన్‌’తో దర్శకుడిగా విజయవంతం అయిన షార్ట్‌ఫిల్మ్స్‌ దర్శకుడు సుజీత్‌ ప్రస్తుతం రెండో చిత్రంగా ప్రభాస్‌ ‘సాహో’ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ తరహాలో ‘బాహుబలి’ వంటి మెమరబుల్‌ హిట్‌ తర్వాత ప్రభాస్‌ ఈ మూవీ చేస్తుండటం విశేషం. అబుదాబిలో పాటు ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో బందిపోటు అయిన ప్రభాస్‌ రాబిన్‌హుడ్‌ తరహాలో దొంగతనం చేసే సీన్‌ని తీశారట. తదుపరి షెడ్యూల్‌ని యూరప్‌లో అనుకున్నప్పటికీ దానిని కూడా సెట్స్‌ వేసి ఆర్‌ఎఫ్‌సిలోనే చిత్రీకరించనున్నారు. 

తాజాగా సుజీత్‌ తన మూడో చిత్రం స్టోరీని బన్నీకి వినిపించి ఓకే చేయించుకున్నాడట. అయినా సాహో వచ్చే స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తే గానీ బన్నీ నుంచి పూర్తి అంగీకారం వచ్చి ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యే అవకాశం లేదు. ఈ విషయంలో ‘సాహో’ రిజల్ట్‌ కోసం బన్నీ కూడా ఎదురు చూస్తున్నాడని, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది. 



By December 31, 2018 at 08:15AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44098/saaho.html

No comments