Breaking News

‘చెప్పను’.. దీనికంటే సమాధానం బన్నీ?


సృష్టిలో ఆడ, మగ, దళితులు, అగ్రవర్ణాలు, వయసులో పెద్దవారు, చిన్నవారు వంటి తేడాలుంటాయని ఎక్కువమంది నమ్ముతూ ఉంటారు. కానీ నిజానికి ఈ లోకంలో బలవంతులు, బలహీనులు, ఆర్థికబలం ఉన్నవారు, పేద వారు అనే తేడా తప్ప మిగిలినవి ఏమీ లేవనే చెప్పాలి. వయసుని, గొప్పతనాన్ని బట్టి గౌరవం ఇవ్వడం కాకుండా ప్రతి వ్యక్తి ఎదుటివ్యక్తిని గౌరవించడం ముఖ్యం. వయసు, డబ్బుని బట్టి గాక ప్రతి వ్యక్తి ఎదుటివారి నుంచి గౌరవం పొందడం ముఖ్యమని చెప్పాలి. 

ఇక విషయానికి వస్తే తాజాగా అల్లుఅర్జున్‌ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారి తీస్తున్నాయి. ఆయన ‘పడిపడి లేచె మనసు’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో ఎదుటి వ్యక్తిపై ఇష్టం ఉన్నా లేకున్నా, నచ్చినా నచ్చకున్నా.. ముందుగా గౌరవించడం నేర్చుకోవాలని వ్యాఖ్యలు చేశాడు. రాజకీయ నాయకులైనంత మాత్రాన గౌరవించకూడదని లేదు కదా? అని సెలవిచ్చాడు. ఇటీవల తాను టీవీ చూస్తుంటే చిరంజీవిని పిలువు అనే మాట తనకి వినిపించిందని, చిరంజీవి ఏంటి? చిరంజీవిగారు అని పిలవాలి... ఎదుటి వ్యక్తులను గౌరవించాలని నీతులు చెప్పాడు. అయితే మీడియా పరిభాషలో ఎప్పుడు కూడా ఎవరు ఎంత గొప్పవారైనా వారి పేర్ల ముందు శ్రీ, గౌరవనీయులైన, గారు వంటి పదాలను వాడకూడదు. ఇది పాత్రికేయ వృత్తిలో నేర్పే ముందు పాఠం. అదే సమయంలో వాక్యం చివరన అన్నాడు.. చెప్పాడు.. అని కాకుండా బహువచనంలో ‘అన్నారు, చెప్పారు’ వంటి పదాలను గౌరవసూచకంగా వాడుతారు. 

మరోవైపు కేవలం చిరంజీవి అంటే అల్లుఅర్జున్‌కి గౌరవం ఉన్నంత మాత్రాన అందరు అలానే గౌరవించాలని కోరుకోవడం సబబు కూడా కాదు. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటే వచ్చేదే గానీ బలవంతంగా తీసుకుంటే వచ్చేదికాదు. అసలు బన్నీ గతంలో పవన్‌ అభిమానులను ఉద్దేశించి కనీస గౌరవం లేకుండా ‘చెప్పను’ అంటూ వ్యాఖ్యలు చేయడం ఆయనకు సరైనదేనా? అంతే కాదు... చెన్నైలో జరిగిన ఓ వేడుకలో బన్నీ.. కమల్‌హాసన్‌ వంటి లెజెండ్‌ ముందు కాలు మీద కాలు వేసుకుని కమల్‌ని అగౌరవపరిచాడనే విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి బన్నీ వంటి వారు ముందు తాము సంస్కారం నేర్చుకుని, తర్వాత పదిమందికి చెబితే బాగుంటుంది. లేదంటే అది గురువింద గింజ సామెత అవుతుందనే చెప్పాలి. 



By December 19, 2018 at 09:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43918/allu-arjun.html

No comments