Breaking News

గయ్యాళీ అత్తపైనే మెగాడాటర్ హోప్స్!


‘దేవదాసు’ అంటే విఫల ప్రేమికుడు. సూర్యకాంతం అంటే గయ్యాళి, రమణారెడ్డి అంటే సన్నగా, పీలగా ఉండేవాడు.. ఇలా పలువురి పేర్లకు పలు ఉదాహరణలు, అతిశయోక్తులు స్థిరపడిపోయాయి. వాటిని మార్చడం అంత సులువు కాదు. గతంలో ‘దేవదాస్‌’ అంటే విఫల ప్రేమికుడు అనే అర్ధాన్ని మార్చివేయడంలో రామ్‌, ఇలియానా జంటగా, వైవిఎస్‌ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్‌’ విజయం సాధించింది. ఇక దర్శకుడు నీలకంఠ తన ఓ చిత్రంలో హీరోయిన్‌ పేరును సూర్యకాంతం అనిపెట్టాడు. కానీ ఆయన సూర్యకాంతం అనే పేరుకి ఉన్న ఇమేజ్‌ని చెరిపివేయలేకపోయాడు. 

గయ్యాళి అత్తగా పేరొందిన సూర్యకాంతం గొప్పతనం ఏమిటంటే.. ‘గుండమ్మ కథ’ చిత్రాన్ని బాలకృష్ణ, నాగార్జునలతో రీమేక్‌ చేయాలని భావించినా కూడా కేవలం గుండమ్మ పాత్రకి సరైన నటి దొరక్క ఆ రీమేక్‌ని పక్కనపెట్టారు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ‘సూర్యకాంతం’ అనే టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. ‘ఒక మనసు’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమై, ఇటీవల ‘హ్యాపీ వెడ్డింగ్‌’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా డాటర్‌, మెగాబ్రదర్‌ నాగబాబు తనయ నిహారిక ఇందులో టైటిల్‌ పాత్రను పోషిస్తోంది. రాహుల్‌ విజయ్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని తాజాగా నిహారిక సోదరుడు, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ విడుదల చేశాడు. షార్ట్‌ఫిల్మ్స్‌ దర్శకుడు ప్రణీత్‌ బి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌లో హీరో హీరోయిన్లు రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నారు.

నిర్వాణ సినిమాస్‌ బేనర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో హీరోయిన్‌ హీరో వైపు ఎంతో ప్రేమ ఆప్యాయత కలగలసిన చూపుతో రొమాంటిక్‌గా కనిపిస్తోంది. రెండో చోట మాత్రం హీరోని రాక్షసిలా భయపెడుతూ, హీరోని టార్చర్‌ పెడుతున్నట్లుగా ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలకు సిద్దమవుతున్నఈ చిత్రం నిహారికకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! ఆసక్తికర టైటిల్‌తో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రమైనా మెగా డాటర్‌కి బ్రేక్‌నిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది.. మొత్తానికి మొదటి లుక్‌ మాత్రం టైటిల్‌ ‘సూర్యకాంతం’ని జస్టిఫై చేసే విధంగానే ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని వరుణ్‌తేజ్‌ సమర్పిస్తూ ఉండటం విశేషం. 



By December 19, 2018 at 02:07PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43921/niharika.html

No comments