Breaking News

క్రిష్.. ఏ ఫార్మెట్‌ని వదలడం లేదుగా?


తెలుగులో ఉన్న నేటితరం క్రియేటివ్‌ అండ్‌ డెడికేటెడ్‌ డైరెక్టర్స్‌లో క్రిష్‌ జాగర్లమూడి పేరును ముందుగా చెప్పుకోవాలి. తన తొలి చిత్రం ‘గమ్యం’తోనే జీవితసారాన్ని తెలిపిన ఆయన ఆ తర్వాత తీసిన చిత్రాలు కూడా జయాపజయాలకు అతీతంగా గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. ‘వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె’ వంటివన్నీ ఆయన అభిరుచికి అద్దం పట్టేవే కావడం గమనార్హం. ఇక కమర్షియల్‌ డైరెక్టర్‌గా కూడా ఆయన పేరు మార్మోగిపోయింది బాలకృష్ణ 100వ ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీ పుత్రశాతకర్ణి’తోనే. చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రాలను కూడా తాననుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయంలో పూర్తి చేయడంలో తనకు తానే సాటి అని ఆయన నిరూపించుకున్నాడు. ఈ మూవీతో ఆయన కమర్షియల్‌ డైరెక్టర్‌గా కూడా మంచి పేరు సాధించాడు. ఈమధ్యలో ఆయన బాలీవుడ్‌లో చేసిన ‘రమణ’ (ఠాగూర్‌) రీమేక్‌ ‘గబ్బర్’ మాత్రమే పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయింది. ఈయన ప్రతిభను ‘గౌతమీపుత్రశాతకర్ణి’ సమయంలోనే చూసిన బాలయ్య తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తేజ దర్శకత్వంలో ప్రారంభించిన చిత్రాన్ని క్రిష్‌ చేతుల్లో పెట్టాడు. దాంతో ఈ మూవీపై తేజ కంటే క్రిష్‌ వల్లనే ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి. 

ఇక ఈయన ఫస్ట్‌ఫ్రేమ్‌ పతాకంపై టీవీ సీరియల్స్‌నే కాక, ‘అంతరిక్షం’ వంటి చిత్రాలను కూడా రాజీవ్‌రెడ్డితో కలిసి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వేగంగా తీస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండు భాగాలుగా రూపొందుతోంది. ఎన్టీఆర్‌ సినీ జీవితానికి సంబంధించి ‘కథానాయకుడు’, రాజకీయ జీవితం గురించి ‘మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా ఇది రూపొందుతుండటం విశేషం. కాగా త్వరలో ఆయన వెబ్‌సిరీస్‌లకు కూడా శ్రీకారం చుడుతున్నాడు. అది కూడా చారిత్రక నేపధ్యం ఉన్న కథ అయిన రాజరాజ చోళుడి జీవిత చరిత్ర కావడం విశేషం. దీనిని సీనియర్‌ దర్శకుడు సురేష్‌కృష్ణ దర్శకత్వంలో క్రిష్‌ నిర్మిస్తూ ఉండటం విశేషం. క్రిష్‌ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందనున్న దీనిని మొదట తమిళంలో రూపొందించి, తర్వాత తెలుగులోకి అనువాదం చేయనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌ పూర్తయిన వెంటనే క్రిష్‌ ప్రారంభిస్తాడని తెలుస్తోంది. 



By December 21, 2018 at 09:30AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43950/director-krish.html

No comments