Breaking News

నో కాంట్రవర్శీ.. ‘యన్.టి.ఆర్’ గౌరవానికే..


తెలుగులో పరుచూరి బ్రదర్స్‌ వంటి వారు పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం, త్రివిక్రమ్‌, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి వంటి ఎందరో రచయితలు తమ చిత్రాలకే పరిమితం కావడమో, లేదా దర్శకులుగా, నటులుగా స్థిరపడటంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో రచయితల కొరత బాగా ఉందనే చెప్పాలి. అలాంటి సమయంలో అతి తక్కువ చిత్రాలతోనే మంచి రచయితగా పేరు తెచ్చుకున్న రైటర్‌.. సాయిమాధవ్‌ బుర్రా. 

క్రిష్‌ వెతికి పట్టుకుని తన ‘కృష్ణం వందే జగద్గురుం’ ద్వారా టాలీవుడ్‌కి పరిచయం చేసిన ఆయన ఆ తర్వాత ‘కంచె, గౌతమీపుత్రశాతకర్ణి, గోపాలా..గోపాలా, మహానటి’ వంటి ఎన్నో చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు అందించారు. ఇక ఎమోషనల్‌, బయోపిక్‌లకు అద్భుతంగా రాస్తాడని పేరు తెచ్చుకున్న ఆయన మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం ‘ఖైదీనెంబర్‌ 150’ కి సైతం పనిచేశాడు. ప్రస్తుతం ఆయన మరోసారి బాలకృష్ణ-క్రిష్‌ల కాంబినేషన్‌లో వస్తోన్న ‘కథానాయకుడు, మహానాయకుడు’లతో పాటు మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన బయోపిక్‌ మూవీ ‘సైరా.. నరసింహారెడ్డి’కి కూడా పనిచేస్తున్నాడు. 

తాజాగా ఆయన ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఉన్నదిఉన్నట్లు చూపించడానికి, నిజాలు చెప్పడానికి మా వంతు కృషి చేశాం. ఎవరిని కించపరిచే ఉద్దేశ్యం మాకు అసలు లేదు. అందరిని గౌరవించేలా మా కథ సాగుతుంది. ప్రతి పాత్రకు సంబంధించిన సంభాషణలను ఎంతో ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ రాశాను. ఎన్టీఆర్‌గారికి ఎంత గొప్ప చరిత్ర ఉందో.. అంతే గొప్పగా ఈ సినిమా మేకింగ్‌ ఉంటుంది. 

ఎన్టీఆర్‌ వంటి మహానుబాహుడి చరిత్రకు సంబంధించిన చిత్రానికి.. అందునా మరోసారి బాలయ్యకు సంభాషణలు రాయడం ఎంతో అదృష్టంగా ఫీలవుతున్నాను. ఎన్టీఆర్‌ పాత్రకి బాలకృష్ణ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. ఇందులో సీఎస్‌ఆర్‌, రేలంగి వంటి హాస్యపాత్రలే కాదు.. ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి మహానుభావుల పాత్రలకు కూడా మంచి డైలాగ్స్‌ రాశాను... అని తెలిపాడు. 

అంటే ఈ మూవీలో ప్రతి ఒక్కరిని చివరకు నాదెండ్ల భాస్కర్‌రావు నుంచి చంద్రబాబు, వైఎస్‌ వరకు అందరినీ హుందాగా చూపించారనే నమ్మకం కలుగుతోంది. మరి బాలయ్య అందరినీ అంత గొప్పగా చూపిస్తే, ‘యాత్ర’లో కూడా ఇలాగే అందరినీ, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులను కూడా గొప్పగానే చూపించారా? లేక ఏమైనా తేడా ఉందా? అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 



By December 31, 2018 at 07:38AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44095/sai-madhav-burra.html

No comments