రాజమౌళి కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు!
దక్షిణాది అంటే మణిరత్నం తర్వాత శంకర్ పేరే ఎక్కువగా వినిపించేది. టెక్నాలజీని వాడటంలో ఆయన తర్వాతే ఎవరైనా అనే పేరు వచ్చింది. కానీ ‘మగధీర, ఈగ’ చిత్రాలతో రాజమౌళి తాను సైతం అంటూ ముందుకు వచ్చాడు. ముఖ్యంగా ‘బాహుబలి’ చిత్రం అయితే ఇండియాలోనే అందునా దక్షిణాదిలోనే హాలీవుడ్ సినిమాలకు ధీటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంత పర్‌ఫెక్ట్‌గా ఉపయోగించే దర్శకుడు ఉన్నాడా? అని అందరు ముక్కున వేలేసుకునేలా చేసింది. అదేమి చిత్రమో గానీ ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి చిత్రం అంటూ ప్రచారం జరిగిన తమిళ ‘పులి’ నుంచి బాలీవుడ్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ వరకు అన్నీ బోల్తా పడ్డాయి. ఇప్పుడు శంకర్ తీస్తోన్న ‘2.ఓ’ కూడా ‘బాహుబలి’కి ధీటుగా తీసిన చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. మరి శంకర్ అయినా ‘బాహుబలి’ రికార్డును బద్దలు కొడతాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.
ఇక విషయానికి వస్తే ఒక సినిమాకి మరో సినిమాకి కొండంతలా పెరిగిపోతున్న ఇమేజ్‌ను రాజమౌళి తన తదుపరి చిత్రం విషయంలో కూడా అలానే జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదట్లో తన తదుపరి చిత్రం ఎలాంటి గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు లేకుండా తీస్తానని ఆయన చెప్పాడు. కానీ ‘2.ఓ’ని మించాలనే తపనతో కాబోలు ఇప్పుడు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి తీస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం మరింత అద్భుతమైన, ‘2.ఓ’ని మించిన టెక్నాలజీని వాడుతున్నాడట. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ముందుగా పోరాట దృశ్యాలను మొదలుపెట్టారు. దీని కోసం ఏకంగా 120 కెమెరాలను ఆయన వాడుతున్నాడట. వీటికి 4డి టెక్నాలజీని వాడుతున్నాడని తెలుస్తోంది. ఫైట్స్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, చరణ్‌ల హావభావాలు, ముఖకవళికలన్నింటినీ 4డి టెక్నాలజీతో క్యాప్షర్ చేయనున్నాడు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్, చరణ్‌లు కొత్త లుక్‌లతో సిద్దమయ్యారు. ప్రముఖ బాలీవుడ్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు కన్నులపండుగేనని చెప్పాలి.
హైదరాబాద్ శివార్లలో ఈ చిత్రం కోసం భారీ సెట్‌ని నిర్మించారు. చిత్రంలోని ఎక్కువ శాతం షూటింగ్ ఈ సెట్‌లోనే జరగనుంది. దాంతో ‘బాహుబలి’ సమయంలో రామోజీఫిలింసిటీలోనే అందరికీ వసతి కూడా ఏర్పాటు చేసిన జక్కన్న ఈ సెట్ దగ్గరే తన కోసం ఓ ప్రత్యేకమైన తాత్కాలిక వసతిని ఏర్పాటు చేసుకున్నాడట. కథా నేపధ్యం ప్రకారం ఇందులోని చాలా సన్నివేశాలు అటవీ నేపధ్యంలో సాగుతాయని తెలుస్తోంది. ‘బాహుబలి’ కోసం కిలికి భాషను కనిపెట్టిన జక్కన్న ఈ తాజా చిత్రం కోసం మరో అటవీభాషను పాపులర్ చేయనున్నాడని సమాచారం.
ఇక రాజమౌళి ‘బాహుబలి’ తదుపరి చిత్రం అంటే దేశవ్యాప్తంగా అన్ని భాషల వారు వెయిట్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్, చరణ్‌లకు ఇతర అన్ని భాషల్లో పెద్దగా క్రేజ్ లేదు. అయినా కూడా ‘బాహుబలి’తో ప్రభాస్‌ని దేశవిదేశాలలో కూడా పాపులర్ చేసిన జక్కన్న కాస్త నేషనల్, ఇంటర్నేషనల్ లుక్ రావడం కోసం శంకర్ ‘2.ఓ’లో అక్షయ్‌కుమార్‌ని తీసుకున్న తరహాలో తన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో అజయ్‌దేవగణ్‌ని తీసుకోవాలని భావిస్తున్నాడట. మొత్తానికి శంకర్-జక్కన్నల మద్య జరుగుతున్న పోటాపోటీ వాతావరణం దక్షిణాది చిత్ర పరిశ్రమకు మరింత గుర్తింపును తేవడం మాత్రం ఖాయమని, ఇది ఆరోగ్యకరమైన పోటీనే అని చెప్పవచ్చు.
By November 24, 2018 at 08:49AM
No comments